కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్రంలో చెడగొట్టు వానల్లాగ తయారయ్యాయి : మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు చెబితే నిజం అవుతుందనే గోబెల్స్ ప్రచారం లాగా రేవంత్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నాడు అని హరీశ్ రావు మండిపడ్డారు.
తెలంగాణలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరిత్యాల కంటే కూడా దారుణంగా తయారయ్యాయి. చెడగొట్టుడు వానలు పడితే పంటలు దెబ్బతిన్నట్లు.. కాంగ్రెస్, బీజేపీ మాట్లాడే మాటలతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారి పోతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. జడ్చర్లలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. వడగండ్ల వాన పడితే నష్టపోయినట్లు.. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల వల్ల కూడా తెలంగాణకు నష్టం జరుగుతోందని హరీశ్ రావు దుయ్యబట్టారు.
దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా సీఎం కేసీఆర్ పాలన ఉంది. మన పథకాలను దేశం మొత్తం కాపీ కొడుతోంది. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు చెబితే నిజం అవుతుందనే గోబెల్స్ ప్రచారం లాగా రేవంత్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నాడు అని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా. కానీ సీఎం కేసీఆర్ జిల్లాకొక మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారు అని మంత్రి చెప్పారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆనాడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈనాడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 5 మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నామని చెప్పారు. లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కొడంగల్‌కు 100 పడకల ఆసుపత్రికిన కేటాయించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క ఆసుపత్రిని కూడా తీసుకొని రాలేకపోయారు. కానీ అబద్దపు ప్రచారాలు మాత్రం చేస్తారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరుకు కరువు, వలసలు, ఆత్మహత్యలను ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక చేస్తున్న అభివృద్ధి పనులు చూసి వలస వెళ్లిన వారందరూ తిరిగి వస్తున్నారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.. ఇంత అభివృద్ధి జరిగేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయని అన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నారని మంత్రి చెప్పారు.
ఆనాడు ఉద్యమంలో కలిసి రాలేదు. ఈనాడు అవతరణ ఉత్సవాలు జరుపుకోవద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను, అమరులను అవమానపరుస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పాసయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందన్నారు.
కల్వకుర్తి ప్రాజెక్టును కట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ల పట్టింది. కానీ, అంతకు పదింతలు పెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వేగంగా కట్టుకుంటున్నామని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులు ముందుకు జరగకుండా కేసులు వేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకడుకు వేయకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తోందని చెప్పారు. గత పాలకులు 60 ఏళ్లు పాలించినా జరగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో 8 ఏళ్లలోనే సాధ్యమయ్యిందని చెప్పారు.
పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలన తెస్తాం అంటున్నది అంటే.. గతంలో ఉన్న 200 పెన్షన్ తెచ్చుకోవడమే. ఇప్పుడు ఉన్న దళిత బంధు, రైతు బంధును వదులుకోవడమే అని హరీశ్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్‌మెయిలర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకొని పోతోంది. కానీ ఈ అభివృద్ధిని చూసి కొంత మంది మూర్ఖులు ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా విలువను రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే మాట్లాడతాడని అన్నారు. రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్న రేవంత్ రెడ్డి.. అసలు మిడ్జిల్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సమాజంలో కల్లోలాలు రేపి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.