'కారు'లో సీటు కోసం పోటాపోటీ - ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు
ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీఆర్ఎస్‌లో నేతలంతా ఎమ్మెల్యే సీటు కోసం వేట మొదలుపెట్టేశారు. ఈసారి పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఉన్నంత వెయిట్ ఎమ్మెల్సీలకు ఉండకపోవడమే దీనికి కారణం.
భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు సీటు కోసం పోటీ కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ విజయఢంకా మోగించడం తథ్యమనే ధీమాతో ఉన్న ఆ పార్టీ నేతలు తామూ అధికారంలో భాగం కావాలని ఇప్పటినుంచే తహతహలాడుతున్నారు. `కారు`లో సీటు కోసం ఇప్పటినుంచే కర్చీఫ్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. టికెట్ కోసం ప్రగతి భవన్‌లో ఇప్పటినుంచే పైరవీలు చేస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలుగా ఉంది పరిస్థితి.
ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీఆర్ఎస్‌లో నేతలంతా ఎమ్మెల్యే సీటు కోసం వేట మొదలుపెట్టేశారు. ఈసారి పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఉన్నంత వెయిట్ ఎమ్మెల్సీలకు ఉండకపోవడమే దీనికి కారణం. బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. అందుకే ఎమ్మెల్సీలు ఈ సారి ఎమ్మెల్యే సీటు సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలు ఇప్పటినుంచే మొదలుపెట్టారు. జనంలో నెగిటివిటీ ఉన్న, అధిష్టానం వద్ద నమ్మకం కోల్పోయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారు పావులు కదుపుతున్నారు. ఇదే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సీటు పోటీకి కారణమైంది.
తమ సీటుకే ఎసరు పెట్టేందుకు ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తుండటంతో వారిని దూరం పెడుతున్నారు ఎమ్మెల్యేలు. మెజారిటీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు కూడా వారిని ఆహ్వానించడం లేదు. దీనిని ఎదుర్కొనేందుకు ఎమ్మెల్సీలు తెలివిగా ఎత్తుగడ వేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తమవైపు తిప్పుకుంటున్నారు. వారిని తమ వర్గంలో చేర్చుకొని బలం, బలగం పెంచుకుంటున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, యూత్ లీడర్ల వంటి నేతలతో టచ్‌లు ఉంటున్నారు. ఎన్నికల నాటికి పార్టీ అధిష్టానం వద్ద తమ దమ్ము చూపి దుమ్ము రేపాలని కృతనిశ్చయంతో పావులు కదుపుతున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీకి కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేతలిద్దరూ గతంలో చాలాసార్లు ఒకరిపై ఒకరు తొడలు కొట్టి మీసాలు మెలేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరోపక్క డోర్నకల్ సీటుపై సత్యవతి రాథోడ్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. దీంతో తన సీటు కాపాడుకునేందుకు అక్కడి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. డోర్నకల్ తనదేనంటూ పదేపదే ఆయన ప్రకటనలు చేస్తుండటం దీనికి ఉదాహరణ. ఇంకోపక్క ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మధ్య కూడా నాగార్జునసాగర్ సీటు కోసం పోటీ కొనసాగుతోంది. మరోపక్క వరంగల్ పశ్చిమ నుంచి పోటీకి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు సీఎం మనిషిగా పేరుంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చకచకా ఒక బిల్డింగ్ కూడా కట్టేశారు. దీంతో అక్కడి ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్‌కు టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లిపై గురి పెట్టారు. ఇది లోకల్ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామిరెడ్డికి శిరోభారంగా మారింది. ఇలా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో పక్కా గెలుపు గుర్రంగా కనిపిస్తున్న బీఆర్ఎస్‌లో సీటు సాధించేందుకు ఇప్పుడు నేతలంతా తమ పార్టీ నుంచే ఎదురవుతున్న సీటు పోటీని ఎదుర్కొనేందుకు ఎవరి ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నారు. మరి అధిష్టానం దృష్టిలో ఎవరెవరిపై ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఎవరికి సీటు ఖాయం చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే.