ఆలూ లేదు చూలూ లేదు... తెలంగాణ బీజేపీలో 5గురు సీఎంలు రెడీ!

ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీలో ఇప్పటికే ముగ్గురు నేతలు రేసులో ఉండగా ఇప్పుడు మరో ఇద్దరు నేతలు రంగంలోకి దిగారు. గతంలో రాష్ట్ర మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న తమ నాయకులే ముఖ్యమంత్రి పదవికి అసలైన అర్హులు అని వారి అనుచరులు ప్రచారం మొదలు పెట్టారు. ఏకంగా ఆ మాజీ మంత్రులిద్దరూ ముఖ్యమంత్రి పదవి పోటీలో తామున్నామంటు కుండబద్దలు కొట్టేశారు.

Advertisement
Update:2022-12-27 11:16 IST

తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని కలలుకంటున్న బీజేపీ అందుకోసం చేయని ప్రయత్నం లేదు. ఎమ్మెల్యేల‌ కొనుగోలుకు ప్రయత్నాలు, కాంట్రాక్టుల ఆశ చూపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం, 'మసీదులను తవ్వుదాం శవమొస్తే మీకు, శివుడొస్తే మాకు' అంటూ రెచ్చగొట్టి మత ప్రాతిపదికన ప్రజలను చీలడానికి ప్రయత్నించడం, చిన్న ఎన్నిక జరిగినా జాతీయ స్థాయి నాయకులతో సహా బీజేపీ పెద్ద, చిన్న నాయకులంతా తెలంగాణలో దిగిపోవడం..... ఇలా ఒకటేమిటి అధికారం కోసం చేయని పనంటూ లేదు.

ఇంత చేసినా నాగార్జున సాగర్, మునుగోడు ఎమ్మెల్యే ఎన్నికల్లో, తాజాగా నిన్న జరిగిన సిరిసిల్లా సెస్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు మాత్రం వదులుకోలేదు.

ఇప్పటికే ఆ పార్టీలో ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ లు తమ ప్రయత్నాల్లో తామున్నారు. బండి సంజయ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి అనుచరులు కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత తమ నాయ‌కునికి మాత్రమే ఉందని వాదిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ ఇప్పటికే మూడుగా చీలిపోయింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మరో ఇద్దరు నేతలు రంగంలోకి దిగారు. గతంలో రాష్ట్ర మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న తమ నాయకులే ముఖ్యమంత్రి పదవికి అసలైన అర్హులు అని వారి అనుచరులు ప్రచారం మొదలు పెట్టారు. అనుచరులేదో తెలిసీ తెలియక చేశారనుకోవచ్చు. ఏకంగా ఆ మాజీ మంత్రులిద్దరూ ముఖ్యమంత్రి పదవి పోటీలో తామున్నామంటు కుండబద్దలు కొట్టేశారు.

''పదేళ్ళపాటు మంత్రిగా పని చేసిన తనకే ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి'' అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించడం, ''ప్రజలు కోరుకుంటే తప్పకుండా సీఎం అవుతాను'' అని ఈటల రాజేందర్ కామెంట్ చేయడం బీజేపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. పైగా ఈ మధ్య జరిగిన ఓ సర్వే లో ఈటల నే సీఎం కావాలని ప్రజలు స్పష్టం చేశారంటూ ఆయన అనుచరులు ప్రచారం మొదలు పెట్టారు.

ఇప్పటికే ముగ్గురు నాయకులు సీఎం పదవి కోసం పోటీ పడుతుండగా మరో ఇద్దరు వచ్చి పోటీలో చేరడమే కాకుండా ఆ విషయంపై బహిరంగంగానే మాట్లాడటంపై బీజేపీలో ఆసక్తికర చర్చనడుస్తోంది.

అయితే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 90 స్థానాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులే లేరు. గ్రామస్థాయిలో కార్యకర్తలు లేరు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను చేర్చుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఆ పార్టీది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పాత కాపులు వాపోతున్నారు. అసలు ఎన్ని సీట్లు గెలుస్తారనే అంశంపై స్పష్టత లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నాయకులను బట్టి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి కోసం లొల్లి ఏంటని బీజేపీ కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News