సహనం కోల్పోతున్న కమ్యునిస్టులు.. కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలియక ఆందోళన!

తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి.

Advertisement
Update:2023-04-03 09:28 IST

కమ్యూనిస్టులు ఒకప్పుడు దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా నిర్ణయాత్మక శక్తిగా ఉండేవారు. పలు రాష్ట్రాల్లో అధికారం కూడా చేపట్టిన రోజులు ఉన్నాయి. కానీ, ఇప్పుడు అదంతా చరిత్ర. నేడు తమ ఉనికిని కాపాడుకోవడానికే చాలా కష్టాలు పడుతున్నారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా.. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఒకటో రెండో సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగానే కనపడుతున్నది. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగితే.. తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగిన సీట్లు గెలుచుకున్న కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు ఒక్క చోట కూడా గెలవలేక నానా తంటాలు పడుతున్నాయి.

తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు పార్టీలు సంపూర్ణ మద్దతు పలికాయి. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో కలిసి సీట్లు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీల నాయకులు పదే పదే మీడియా ముందు చెబుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి కానీ, పార్టీ అధిష్టానం నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కమ్యునిస్టు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యలు చూస్తే.. వారు సహనం కోల్పోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పాలేరులో నిర్వహించిన ఒక సమావేశంలో తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. ఆనాడు చాలా కంట్రోల్డ్‌గా మాట్లాడిన తమ్మినేని.. ఇటీవల మాత్రం ఫలానా చోటు పోటీ చేస్తామంటూ లిస్టు చెబుతున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఒప్పుకోకపోయినా సీపీఎం బరిలో ఉంటుందని ప్రకటించారు. అయితే, అభ్యర్థి ఎవరో చెప్పలేదు. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో సీపీఎం పార్టీకి మంచి ఆదరణే ఉండేది. కానీ ఇటీవల ఆ పార్టీకి ఓట్లు పడటం కష్టంగా మారింది.

ఎన్నికల పొత్తులపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇంకా ఏమీ మాట్లాడటం లేదు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల విషయంపై కేసీఆర్ పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన దృష్టి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, జాతీయ రాజకీయాల పైనే ఉంటుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పరంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు, మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తుల గురించి బీఆర్ఎస్ ఇంకా ఆలోచించడం లేదు. కానీ, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం పొత్తుల ప్రకటన లేకపోవడంతోనే కమ్యూనిస్టు నాయకులు అసహనానికి గురవుతున్నారనే చర్చ జరుగుతున్నది. ఒకవైపు సీపీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తుండగానే.. సీపీఐ కూడా అదే బాట పట్టింది. కొత్తగూడెం నుంచి తానే పోటీ చేస్తానని సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు ప్రకటించుకున్నారు. మిర్యాలగూడ, కొత్తగూడెంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది అక్కడి సిట్టింగులకు ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు పొత్తు పెట్టుకుంటామని చెబుతూనే.. మరోవైపు ఏకపక్షంగా సీట్లు ప్రకటించుకుంటుండంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వైఖరి వల్ల పార్టీల మధ్య స్నేహ బంధం చెడిపోతుందని సూచిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలు కాస్త సహనంతో వ్యవహరిస్తే.. సీఎం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తారని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News