నా విజన్ కు అది దగ్గరగా ఉంది..
థేమ్స్ నది, దానిపై నిర్మాణాలు, ఆ పరీవాహకంలో వాణిజ్య కార్యకలాపాలను అధికారుల బృందంతో కలిసి అధ్యయనం చేశామని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మూసీ సుందరీకరణ విషయంలో తన విజన్ కు థేమ్స్ నది దగ్గరగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన లండన్ చారిత్రక వైభవంగా చెప్పుకునే టవర్ బ్రిడ్జ్ ని సందర్శించారు. 1894లో థేమ్స్ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఆ ప్రాంతం పర్యాటకంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిందని అన్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితోపాటు HMDA కమీషనర్ ఆమ్రపాలి, ఇతర అధికారులు ఈ పర్యటనలో ఉన్నారు. థేమ్స్ నది, దానిపై నిర్మాణాలు, ఆ పరీవాహకంలో వాణిజ్య కార్యకలాపాలను అధికారుల బృందంతో కలిసి అధ్యయనం చేశామని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పటికే మూసీ సుందరీకరణ విషయంపై లండన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఆ విషయంలో తమ సహాయ సహకారాలు ఉంటాయని లండన్ అధికారులు హామీ కూడా ఇచ్చారు. రేవంత్ టీమ్ తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాల్సి ఉంది.
రేవంత్ మార్క్ కనపడుతుందా..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే పాలనపై తనదైన ముద్ర చూపించాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైతే ఆ గొప్పతనం అంతా కాంగ్రెస్ పార్టీకే వెళ్తుంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఏదో ఒకటి చేసి చూపించాలని అనుకుంటున్నారాయన. మూసీ సుందరీకరణ గురించి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని అమలుకోసం ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. థేమ్స్ నది ఒడ్డున చేపట్టినట్టుగా.. ఆ స్థాయిలో సుందరీకరణ అభివృద్ధి మూసీ గట్టున ఆశించడం అత్యేశే అవుతుంది. కనీసం కొంతమేర ప్రయత్నం ఫలించినా ఆ మార్పు చరిత్రలో నిలబడుతుంది. మరి రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.