ఔను.. మోడీ మా పెద్దన్నే.. - అందుకే బీజేపీని విమర్శించట్లేదు
గుజరాత్‌కు మోడీ అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారు. అదే తరహాలో తెలంగాణకు కూడా మంజూరు చేయాలని కోరాను. దాంట్లో తప్పేముందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని పిలవడంలో తప్పేం లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మంగళవారం సచివాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ‘మోడీ మా పెద్దన్న’, ‘గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధి’ అంటూ తను చేసిన వ్యాఖ్యలను సీఎం సమర్థించుకున్నారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు పెద్దన్న తరహా పాత్ర పోషిస్తారని, అమెరికాను ఇతర దేశాలు బిగ్ బ్రదర్ అని పిలుస్తాయని చెప్పుకొచ్చారు.
గుజరాత్‌కు మోడీ అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారు. అదే తరహాలో తెలంగాణకు కూడా మంజూరు చేయాలని కోరాను. దాంట్లో తప్పేముందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, జాతీయ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్న ప్రధాని వ్యాఖ్యలపైనా రేవంత్ స్పందించారు. బీజేపీ నేతలు ఆయనను తప్పుదోవ పట్టించారన్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు ఎందుకు చేయడం లేదని మీడియా ప్రశ్నించగా.. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదని, అందుకే విమర్శించడం లేదన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనంటూ సీఎం సహా కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతుండటం ఇక్కడ కొసమెరుపు.
రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీని పెద్దన్న అని పిలవడంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ఫోన్ చేసి ఇదే విషయాన్ని రేవంత్‌రెడ్డికి వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హడావుడిగా మీడియా ప్రతినిధులను పిలిచి చిట్‌చాట్ పేరుతో తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది.