3 దఫాల్లో రైతు రుణమాఫీ.. రేవంత్ నిర్ణయం

రైతు రుణమాఫీ హామీ రాహుల్ గాంధీ ఇచ్చారని, రాహుల్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని పార్టీ నాయకులకు చెప్పారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-07-17 17:42 IST

రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు దఫాల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.లక్ష లోపు రుణాలను రేపు (గురువారం) సాయంత్రానికి మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 4 గంటల్లోగా రైతుల ఖాతాల్లో రూ.లక్ష నగదు జమ చేస్తామన్నారు. ఇందుకోసం మొత్తం రూ.7 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఇక నెలాఖరు నాటికి రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.

ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి టీపీసీసీ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు. రైతు రుణమాఫీ హామీ రాహుల్ గాంధీ ఇచ్చారని, రాహుల్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని పార్టీ నాయకులకు చెప్పారు రేవంత్ రెడ్డి. వ్యవసాయ విధానంలో తెలంగాణను దేశం అనుసరించాలన్నారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకూ ఏకకాలంలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు. పార్లమెంట్‌లోనూ రుణమాఫీపై ఎంపీలు ప్రస్తావించాలన్నారు రేవంత్ రెడ్డి. రేపు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News