ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం' పథకం ద్వారా ఒక్కొకరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-08-26 19:43 IST

కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30వేలమందికి నియామక పత్రాలు అందించామని, త్వరలో మరో 35వేల పోస్ట్ లు భర్తీ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.


యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం' పథకం కింద ఒక్కొకరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రిలిమ్స్ స్టేజ్ దాటి, మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 135మందికి చెక్కులను అందించారు. ఈ పథకానికి ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ నిధులు సమకూర్చడం విశేషం. ఈసారి రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.

చదువుతోపాటు ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ పెంచుకోడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామని అన్నారు. అదే సమయంలో యువత క్రీడల్లో కూడా రాణించాలని, అంతర్జాతీయ వేదికపై భారత సత్తా చాటాలని చెప్పారు రేవంత్ రెడ్డి. దీనికోసం యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 2028 ఒలింపిక్స్‌ టార్గెట్ గా తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణలో ఎంపిక చేసిన 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలకు నూతన వైస్ ఛాన్స్ లర్లను నియమిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో వర్శిటీల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ లను కూడా త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 

Tags:    
Advertisement

Similar News