ఢిల్లీలో రేవంత్ భేటీలన్నీ విజయవంతమైనట్టేనా..?

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌-విజయవాడ మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Update:2024-01-14 05:39 IST

తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఒకరి తర్వాత మరొకరికి వినతిపత్రాలిస్తున్నారు. వారు సానుకూలంగా స్పందిస్తున్నారని, నూతన ప్రాజెక్ట్ లకు సహకరిస్తామని చెబుతున్నారనేది కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న మాట. మరి కేంద్రం ఆ హామీలకు కట్టుబడి ఉంటుందా..? కొద్ది నెలల్లోనే లోక్ సభకు ఎన్నికలు జరగాల్సిన వేళ, మోదీ ప్రభుత్వానికి రేవంత్ పెట్టుకుంటున్న అర్జీలకు ఫలితం ఉంటుందా..? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.


తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌-విజయవాడ మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మెగా లెదర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి పీయూష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పాటుచేయాలన్న విజ్ఞప్తికి కూడా కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌ కు తుది అనుమతులు మంజూరు చేయాలని, హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ లో ఫార్మాసిటీ కాకుండా నూతన ప్రతిపాదనలు స్వీకరించాలని, తెలంగాణకు కొత్తగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థను మంజూరు చేయాలని.. ఇలా పలు అంశాలకు కూడా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో కేంద్రం తెలంగాణ అభివృద్ధి విషయంలో సహాయ నిరాకరణ చేసింది. మెడికల్ కాలేజీలు కూడా రాష్ట్రం సొంతగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ సీఎంను మాత్రం కేంద్రం సాదరంగా స్వాగతిస్తోంది. ప్రధాని సహా కేంద్ర మంత్రులు కూడా ఆయనకు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తూ వినతిపత్రాలు తీసుకుంటున్నారు. హామీలిచ్చినంత మాత్రాన పనులు అయిపోతాయనుకోలేం. తెలంగాణ విజ్ఞాపనలను కేంద్రం నిజంగానే పరిగణలోకి తీసుకుంటోందా..? ఎన్నికల వేళ అన్నిటీకీ సరేనంటూ కేవలం తలఊపి సరిపెడుతోందా..? అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే మాత్రం మళ్లీ అన్నీ మొదటికే వస్తాయి.

Tags:    
Advertisement

Similar News