మల్కాజ్‌గిరి గెలవాల్సిందే.. అభ్యర్థి ఎవరో చెప్పేసిన రేవంత్

మల్కాజ్‌గిరి మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు రేవంత్.

Advertisement
Update:2024-03-21 21:54 IST

మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదని.. ముఖ్యమంత్రిదన్నారు. తనను సీఎంను చేసింది మల్కాజ్ గిరి గెలుపేనని గుర్తు చేశారు. అప్పుడు నాయకులు అమ్ముడు పోయినా కార్యకర్తలను భుజాలపై ఎత్తుకొని మోసి తనను ఢిల్లీకి పంపించారని అన్నారు. కేసీఆర్ పతనం 2019లో మల్కాజ్ గిరి నుంచే స్టార్ట్‌ అయిందన్నారు రేవంత్. కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.


మల్కాజ్‌గిరి మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ తుఫాను వచ్చినా మల్కాజ్‌గిరిలో రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాల్సిందేనన్నారు. మల్కాజ్‌గిరితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ గెలవాలన్నారు రేవంత్.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పక్కనే సునీతా మహేందర్ రెడ్డి కూర్చుండడంతో ఆమె మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రచారం జరుగుతోంది. ఏ సమావేశంలోనైనా ఆ నియోజకవర్గం అభ్యర్థి పక్కన ఉండడం ఆనవాయితీగా వస్తుంది. ఇవాల్టి సమావేశంలో సునీతా మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ పక్కన కనిపించారు. చేవెళ్ల సీటు ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డికి ఖాయం కాగా.. సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి బరిలో ఉంచాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Tags:    
Advertisement

Similar News