స్త్రీ సంక్షేమం, జనోద్ధారణకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం : సీఎం కేసీఆర్
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేసి సమున్నతంగా గౌరవించుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
స్త్రీ సంక్షేమం, వారి జనోద్ధారణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని మరింతగా పెంచేందుకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుందని కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలతో పాటు ప్రత్యేక సందేశాన్ని అందించారు.
'యత్ర నార్యస్తు పూ జ్యంతే.. రమంతే తత్ర దేవతాః' అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అపూర్వ విజయాలు సాధిస్తూ నారీ శక్తిని చాటుతున్నారని కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేసి సమున్నతంగా గౌరవించుకుంటున్నామని అన్నారు. ఆడపిల్లలు తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.
మహిళలను కంటికి రెప్పలా బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా.. వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతోందని వివరించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
మహిళే ఈ లోకానికి ఊపిరి ధార.. మగువేగా మానవ మనుగడ చిరునామా అనే స్పూర్తితో బాలికలు, మహిళలకు విద్యచ, ఉద్యోగ అవకాశాల కల్పన.. ఆరోగ్యం సంరక్షణ, వివాహానికి ఆర్థిక తోడ్పాడు, భౌతిక రక్షణ, వ్యథార్తులకు జీవన భద్రత, వృద్ధాప్యంలో ఆసరాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని సీఎంవో ట్వీట్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.