క్రీస్తు దీవెనలు అందరికీ లభించాలి.. దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Advertisement
Update:2022-12-25 07:36 IST

ఏసు క్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన క్రీస్తు బోధనలు విశ్వ మానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్విట్టర్ హ్యాండిల్‌లో సీఎం కేసీఆర్ సందేశాన్ని పోస్టు చేశారు.

ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా.. మరో వైపు మానవీయ విలువలు మృగ్యమై పోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు చాలా ఆచరణీయమని అన్నారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవులు కూడా లబ్దిపొందుతున్నారు. ఇక ముస్లింలకు హజ్ భవన్ ఉన్నట్లుగానే.. క్రైస్తవుల కోసం కూడా క్రిస్టియన్ భవన్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఉప్పల్‌లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇటీవల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది.

ఇక క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 35 వేల మంది క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలను ప్రభుత్వం కానుకగా ఇస్తోంది. 2.80 లక్షల మంది పురుషులకు ప్యాంటు షర్ట్, 2 లక్షల 77వేల 500మంది మహిళలకు చీరెలు, 2 లక్షల 77వేల 500మంది బాలికలకు డ్రెస్ మెటీరియల్ ప్రభుత్వం అందజేసింది. గత 8 సంవత్సరాల్లో 411 చర్చిలకు రూ. 2.63 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

క్రిస్టియన్ మైనార్టీ యువతకు అండగా ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ క్రిస్టియన్లకు ఈ పథకం కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందిస్తున్నారు. వీటిని ట్రావెల్స్ లేదా క్యాబ్స్‌గా నడుపుకుంటూ ఆదాయాన్ని పొందుతున్నారు. 154 మందికి రూ.6.90 కోట్లను సబ్సిడీగా అందజేశారు. రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. ఇప్పటి వరకు 1748 మందికి రూ.19 కోట్ల సబ్సిడీ అందించింది. 

Tags:    
Advertisement

Similar News