రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతిని కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో గౌరవించారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో గౌరవించారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ సహా ఇతర అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకుంటారు. రాత్రి అక్కడే ఆమె బస చేస్తారు. రేపు ఉదయం దుండిగల్ లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు ఆమె హాజరవుతారు. రివ్యూయింగ్ ఆఫీసర్ గా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరేడ్ అనంతరం రేపు ఆమె ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఈరోజు రేపు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు మొదలవుతాయి.