దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో కూడిన లోగో చూడ ముచ్చటగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన నుంచి నేటి వరకు తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్తిత్వాన్ని ప్రతిభింభించేలా లోగోను సిద్ధం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో కూడిన లోగో చూడ ముచ్చటగా ఉన్నది.
కాళేశ్వరం వంటి నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్, రైతు బంధు, ఉచిత విద్యుత్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ-హబ్, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ వంటి వాటికి లోగోలో ప్రాధాన్యత కల్పించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ హృదయం ఉప్పొంగేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ తొలి రోజు సచివాలయంలో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. అదే రోజు మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరులను స్మరించేందుక ఒక రోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డేగా జరుపుకోనున్నారు.