ఇవాళ కొండగట్టుకు సీఎం కేసీఆర్.. రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధిపై చర్చలు

స్వామివారి దర్శనం అనంతరం.. ఆలయం అంతా కలియదిగిరి పరిశీలిస్తారు. ఆ తర్వాత జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో కేసీఆర్ సమావేశం అవుతారు.

Advertisement
Update:2023-02-15 07:37 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని ఆలయాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. యాదాద్రి, జోగులాంబ సహా 35 ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా.. ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ఎన్నో వసతులు కల్పిస్తూ.. పర్యాటక ప్రాంతాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టులో ఉన్న ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి మంగళవారమే కేసీఆర్ కొండగట్టు వెళ్లాల్సింది. కానీ, ఆ రోజు ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని తెలుసుకొని.. బుధవారానికి పర్యటన వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి.. 9.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 9.40కి కొండగట్టు చేరుకుంటారు.

స్వామివారి దర్శనం అనంతరం.. ఆలయం అంతా కలియదిగిరి పరిశీలిస్తారు. ఆ తర్వాత జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమావేశం అవుతారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ఈ సారి బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్లతో ఆలయాన్ని ఎలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే అంశంపై ఆయన చర్చించనున్నారు. కొండగట్టు ఆలయంతో పాటు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటి ధార, బేతాళ స్వామి ఆలయాలను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. యాదాద్రి తరహాలోనే ఆలయాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News