తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కొండకల్‌లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
మేధా గ్రూప్ రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న అతిపెద్ద కోచ్ ఫ్యాక్టరీ ఇదే కావడం విశేషం. మేధా గ్రూప్ రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలో ఇప్పటికే ఔరంగాబాద్‌లో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఇక ఏపీలోని నెల్లూరు జిల్లాలో సీఆర్ఆర్‌సీ ఇండియా మెట్రో రైళ్ల కోచ్‌లను తయారు చేస్తోంది. తాజగా రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మరో ఫ్యాక్టరీ ప్రారంభం కానున్నది.
ప్రైవేటు రంగంలో ఏర్పాటు అవుతున్న మూడో కోచ్ ఫ్యాక్టరీ ఇదే. దేశంలో రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదు కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటికి తోడు ప్రైవేటు ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చింది. కొండకల్ వద్ద 150 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్యాక్టరీలో అన్ని రకాల కోచ్‌లు తయారు కానున్నాయి. ఏడాదికి 500 కోచ్‌లతో పాటు 50 లోకో మోటీవ్‌లను కూడా ఉత్పత్తి చేసే సామర్థ్యం కొండకల్‌లో ఏర్పాటు చేయనున్న ఫ్యాక్టరీ కలిగి ఉన్నది.
ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని గతంలోనే కేంద్రం హామీ ఇచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంత వరకు తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, తెలంగాణలో అనేక దిగ్గజ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు తమ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తుండటంతో.. మేధా గ్రూప్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి సహాయ, సహకారాలు అందించింది.
మేధా కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ముందే రూ.600 కోట్ల విలువైన ఆర్డర్‌ను సంపాదించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఈ ఆర్డర్ వచ్చింది. అక్కడ విస్తరించనున్న మోనో రైలు కోసం 10 ర్యాక్స్‌ను ఆర్డర్ ఇచ్చింది. మేధా గ్రూప్‌కు ఇండియాతో పాటు అమెరికా, యూరోప్, దక్షిణ అమెరికా దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి రైల్ కోచ్‌ల ఎగుమతులు కూడా మేధా గ్రూప్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.