సిద్ధిపేటకు ఒకే ఒక్కటి తక్కువైంది..
తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉందని, హరీష్ రావుకు లక్షకు పైగా మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు నెలకొల్పారని మళ్లీ ఆ రికార్డు సిద్ధిపేటకే దక్కాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.
సిద్ధిపేట తనకు ఎందుకంత ప్రత్యేకమో ప్రజా ఆశీర్వాద సభలో వివరించారు సీఎం కేసీఆర్. "సిద్దిపేట గడ్డ నన్ను సాదింది, చదువు చెప్పింది, నాకు రాజకీయ జన్మనిచ్చింది, నన్ను నాయకున్ని చేసింది, ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచింది అని గర్వంగా చెబుతున్నా"నని అన్నారు. "తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నానంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలం ఈ గడ్డ పుణ్యమే"నని చెప్పారు కేసీఆర్.
సిద్దిపేటకు మంచినీళ్లు వచ్చాయని, అధికారం వచ్చిందని, గౌరవం వచ్చిందని, మెడికల్ కాలేజీ వచ్చిందని, మినీ యూనివర్శిటీ వస్తోందని, రైలు కూడా వచ్చిందని.. ఇంకా ఒకే ఒకటి తక్కువ ఉందని, అదే గాలిమోటార్ అని చెప్పారు సీఎం కేసీఆర్. తొమ్మిదిన్నరేళ్లలో సిద్ధిపేట సాధించిన అభివృద్ధిని, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధిపేటకు తీసుకొచ్చిన సంస్థల గురించి ప్రస్తావించారాయన. హరీష్ రావు పట్టుబట్టి సిద్దిపేటకు ఐటీహబ్ తీసుకొచ్చారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక అద్భుత వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట తయారవుతుందని హామీ ఇస్తున్నానన్నారు ఇందులో తనకు అనుమానమేమీ లేదని, సిద్ధిపేట అద్భుతంగా ముందుకుపోతుందని చెప్పారు కేసీఆర్.
ఆ రికార్డు మళ్లీ సిద్ధిపేటకే దక్కాలి..
తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉందని, హరీష్ రావుకు లక్షకు పైగా మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు నెలకొల్పారని మళ్లీ ఆ రికార్డు సిద్ధిపేటకే దక్కాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. హరీష్ రావు పనితనం, మన సిద్దిపేట పటుత్వం.. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలన్నారు.
చింతమడకలో తాను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తల్లికి ఆరోగ్యం దెబ్బతింటే ఊరిలోని ఓ ముదిరాజ్ తల్లి చనుబాలు ఇచ్చి సాదిందని.. అంత అనుబంధం సిద్ధిపేట గడ్డతో తనకు ఉందని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ఇక్కడ తాను పాదయాత్ర చేయని గ్రామం లేదని, తిరగని రోడ్డే లేదని, చూడని కుంటలు, చెరువులు లేనే లేవన్నారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డ అని పేర్కొన్నారు కేసీఆర్.