డబుల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రా

"ద‌ళిత‌బంధు పుట్టించిన మొగోడు ఎవ‌రండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాక‌ముందు ద‌ళిత బంధు ఈ దేశంలో ఉండేనా..?" అని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-11-01 16:48 IST

సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ గత పాలకులపై సెటైర్లు పేల్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ విడిపోతే కారు చీకట్లు కమ్ముకుంటాయని చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని.. ఇప్పుడు మనల్ని శపించినోళ్లే చీకట్లో ఉండిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వెలుగు జిలుగులు ఉన్నాయని చెప్పారు. ఏపీ రైతులు కూడా తెలంగాణలో ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. మీరంతా సరిహద్దుల్లో ఉన్నారు కదా మీకే ఎక్కువ తేడా తెలుస్తుందంటూ సత్తుపల్లి వాసుల్ని ఉద్దేశించి ప్రసంగించారు కేసీఆర్. డబుల్ రోడ్ వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రా.. అదే తేడా అని తేల్చేశారు.


దళితబంధు కోసం ఎవరు ధర్నా చేశారు..?

"ద‌ళిత‌బంధు పుట్టించిన మొగోడు ఎవ‌రండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాక‌ముందు ద‌ళిత బంధు ఈ దేశంలో ఉండేనా..?" అని ప్రశ్నించారు. దళిత‌బంధు పెట్టాలని ఎవరూ అడగలేదని, ఎవరూ ధర్నాలు చేయలేదని, కనీసం దరఖాస్తు కూడా చేయలేదని.. కానీ దళితుల కష్టనష్టాలు చూసి తానే ఆ పథకం తెచ్చానని వివరించారు. అది ఎన్నికల కోసం పెట్టిన పథకం కాదని, అప్పుడు ఎన్నికలు కూడా లేవన్నారు.

ఇవాళ పెడ‌బొబ్బ‌లు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర‌ జెండాలు, ప‌చ్చ ప‌చ్చ‌ జెండాలు.. ఏం చేశాయో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని వారే ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలన్నారు కేసీఆర్. ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే కానీ వారి గురించి ఎవరూ ఆలోచించలేదని వివరించారు. ఉత్త‌ర భార‌త‌దేశంలో ద‌ళితుల మీద ప్రతి రోజూ దాడులు జరుగుతుంటాయన్నారు. యూపీ, బీహార్‌, రాజ‌స్థాన్‌, ప్ర‌ధాని సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ లో కూడా భ‌యంక‌ర‌మైన దాడులు జ‌రుగుతున్నాయన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు పిడికెడు మంది కార్య‌క‌ర్త‌ల‌తో ద‌ళిత చైత‌న్య జ్యోతి అనే కార్యక్రమం చేపట్టానని, నేటి దళితబంధుకి అదే స్ఫూర్తి అని చెప్పారు.

ఎన్నిక‌ల్లో పోటీ చేసే వ్య‌క్తుల‌ చ‌రిత్ర ఏంటో చూడాలన్నారు కేసీఆర్. వారి వెనక ఉన్న పార్టీ చ‌రిత్ర‌, ఆ పార్టీ ప్రజల గురించి ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలుసుకోవాలన్నారు. ఎవ‌రో చెప్పార‌ని ఓటు వేయ‌డం కాదని, కులం వాడు నిల‌బ‌డ్డాడ‌ని ఓటు వేయ‌కూడ‌దని హితవు పలికారు. సత్తుపల్లి ప్రజలు ఆలోచనకలవారని, ఆలోచించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు కేసీఆర్. 


Tags:    
Advertisement

Similar News