సమయం వచ్చినపుడు అస్త్రాలు బయటకు తీస్తాం -కేసీఆర్
తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ ఇవాళ 27లక్షల టన్నులు వాడుతోందని, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. వరి ఉత్పత్తిలో పంజాబ్ తో పోటీ పడుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్.
తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దేనని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ అభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. గతంలో కంటే ఏడెనిమిది సీట్లు ఎక్కువే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో ఉన్న మైలురాళ్లను ఆయన గుర్తు చేశారు. సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి వంటి రంగాల్లో వచ్చిన మార్పులను ప్రస్తావించారు.
అలవికాని హామీలును తామెప్పుడూ ఇవ్వలేదని, అదే సమయంలో ప్రతిపక్షాలు అల్లాడిపోయే అస్త్రాలు తమ దగ్గర చాలానే ఉన్నాయని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు తీస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు పింఛన్లు పెంచుతామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని చెప్పారు. దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉద్యోగుల పేస్కేలు ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో పథకాలకు అందించే నిధులు కూడా క్రమంగా పెంచుకుంటూ పోతామన్నారు కేసీఆర్.
హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని, ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ ఇవాళ 27లక్షల టన్నులు వాడుతోందని, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. వరి ఉత్పత్తిలో పంజాబ్ తో పోటీ పడుతున్నామని చెప్పారు.
"తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12లక్షల ఉంటే.. మనం ఏ రాష్ట్రం నుంచి మనం విడిపోయామో.. ఎవరైతే మనల్ని ఎకసెక్కాలు పలికారో.. మీకు పరిపాలన రాదు అన్నరో వారి తలసరి ఆదాయం రూ.2.19లక్షలు. రెండురాష్ట్రాల మధ్య రూ.లక్ష వరకు తేడా ఉంది." అంటూ ఏపీతో పోలిక చెప్పారు సీఎం కేసీఆర్.
కేంద్రం సహకారం లేకపోయినా..
తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం సహకారం ఇసుమంతైనా లేదాన్నారు సీఎం కేసీఆర్. కానీ కేంద్రం అవార్డులు మాత్రం ఇస్తోందని గుర్తు చేశారు. వరదల వల్ల హైదరాబాద్ లో తీవ్ర నష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడే లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం కోత విధించిందని, దీనివల్ల తెలంగాణ ప్రతి ఏటా 5వేల కోట్ల రూపాయలు నష్టపోతోందని చెప్పారు కేసీఆర్.