మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తులుండవ్, బీఆర్‌ఎస్ ది ఒంటరి పోరే.. కేసీఆర్
సోమవారం తెలంగాణ భవన్‌లో తనను కలిసిన మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గతంలో గొప్ప రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్ర ఇప్పుడు అలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండదని, మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ సంస్థాగత నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేపనిలో ఉందని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో తనను కలిసిన మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గతంలో గొప్ప రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్ర ఇప్పుడు అలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో పరిపాలన పరిస్థితి దిగజారడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, మహారాష్ట్రలోని ఏ రాజకీయ పార్టీలతోనూ బీఆర్‌ఎస్‌కు పొత్తు ఉండదని అన్నారు. బీ.ఆర్. అంబేద్కర్, అన్నా హజారే వంటి మహోన్నత వ్యక్తులకు పుట్టినిల్లు అయిన ఆ రాష్ట్రం దేశానికి గొప్ప ఆదర్శం అన్నారు కేసీఆర్.
“అటువంటి ప్రముఖుల కారణంగా, నేను శాసనసభ్యునిగా ఉన్న మొదటి రోజుల్లో మహారాష్ట్ర గురించి గొప్పగా మాట్లాడేవారు. నేను కూడా ఆ రాష్ట్రం నుండి చాలా నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఈ రోజు మహారాష్ట్రను మళ్ళీ సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉంది'' అని కేసీఆర్ అన్నారు..
రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థాగత నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ కార్యాచరణ ప్రణాళికపై కూడా ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రతినిధులతో చర్చించారు. పార్టీ మొదట తన కార్యాలయాలను ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పూణే వంటి నాలుగు ముఖ్యమైన నగరాల్లో ఏర్పాటు చేస్తుందని, అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పురోగతిలో ఉందని కేసీఆర్ చెప్పారు..
ఇప్పటి వరకు మహారాష్ట్రను పాలించిన రాజకీయ పార్టీల వల్లే తమ ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని గ్రహించిన మహారాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌పై ఆశలు పెట్టుకున్నారు. మహారాష్ట్ర అంతటా బీఆర్‌ఎస్ పవనాలు వీస్తున్నాయని చెప్పిన కేసీఆర్ రైతుల సంక్షేమం, మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
మే 5 నుంచి జూన్ 5 వరకు మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తామని, రైతు, విద్యార్థి, యువజన, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి తొమ్మిది కమిటీలతో పాటు గ్రామస్థాయి పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కమిటీలు తెలంగాణ మోడల్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పథకాలను వివరిస్తూ రోజుకు కనీసం ఐదు గ్రామాలను కవర్ చేస్తాయి. మరాఠీలో పాటలతో పాటు పార్టీ ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తున్నట్లు కేసీఆర్ మహారాష్ట్ర నాయకులకు తెలిపారు.