ఆ ఐదు సీట్లపై సీఎం కేసీఆర్ కసరత్తు!

గోషామహల్ నుంచి పార్టీ ఇంచార్జి నందకిశోర్‌తో పాటు ఆశీష్ కుమార్ యాదవ్ పేర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది.

Advertisement
Update:2023-09-27 06:00 IST

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు సిట్టింగులకే టికెట్లు దక్కాయి. పలు కారణాల వల్ల గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్సాపూర్ స్థానాలకు టికెట్లు ప్రకటించలేదు. దీంతో పాటు మల్కాజిగిరి స్థానానికి మైనంపల్లి హన్మంతరావు టికెట్ ప్రకటించన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. తనతో పాటు కొడుకు రోహిత్‌కు టికెట్ ఇవ్వలేదని ఆయన పార్టీని వీడారు. దీంతో మొత్తం 5 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావల్సి ఉన్నది. సీఎం కేసీఆర్ ఈ ఐదు స్థానాల్లో ఎవరిని బరిలో దింపాలనే విషయంపై సీనియర్ నాయకులతో కలిసి చర్చించినట్లు తెలుస్తున్నది.

మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జిగా ఉన్న రాజశేఖర్ రెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉన్నది. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఆయన స్థానికంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. దీంతో రాజశేఖర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ రోజు నియోజకవర్గంలో ర్యాలీ ఏర్పాటు చేసి.. స్థానికంగా తన బలాన్ని నిరూపించుకోవాలని రాజశేఖర్ భావిస్తున్నారు.

ఇక జనగామ నియోజకవర్గంపై కూడా భారీ కసరత్తు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పార్టీలో మంచి స్థానం దక్కుతుందని.. భవిష్యత్‌పై ఆందోళన చెంద వద్దని చెప్పినట్లు తెలుస్తున్నది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి దాదాపు టికెట్ ఖాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా ఆమెకే టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు చెబుతున్నాయి. నాంపల్లి టికెట్ కోసం పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక గోషామహల్ నుంచి పార్టీ ఇంచార్జి నందకిశోర్‌తో పాటు ఆశీష్ కుమార్ యాదవ్ పేర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నారు. కోలుకున్న వెంటనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News