కేసీఆర్ మరో బ్రహ్మాస్త్రం..రైతులకు పెన్షన్.!
ఇప్పటికే తెలంగాణలో రైతుల మేలు కోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ.10 వేలు, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇక ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్.. రైతుల కోసం మరో కొత్త పథకం అమలు చేయబోతున్నారని జోరుగా చర్చ జరుగుతోంది.
సీఎం కేసీఆర్ రైతులకు పెన్షన్ అనే కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలు, పెన్షన్ మొత్తం ఎంత ఉండాలి, వయస్సు, అవసరమయ్యే నిధులు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ టర్మ్‌లోనే రైతులకు పెన్షన్ అనే పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకువస్తారని ప్రచారం జరిగింది. కానీ, సాధ్యం కాలేదు. అయితే ఈ పథకాన్ని రాబోయే ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెడతారని తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో రైతుల మేలు కోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ.10 వేలు, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తున్నారు. రుణమాఫీ కింద లక్ష రూపాయల లోపు లోన్లను మాఫీ చేశారు. విడతల వారీగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేస్తున్నారు. ఇక రైతులకు పెన్షన్ పథకం తీసుకువస్తే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు తీసుకువచ్చిన రైతుబంధు పథకం బీఆర్ఎస్ 88 స్థానాలు సాధించడంలో కీ రోల్ ప్లే చేసింది.