మునుగోడుకు సీఎం కేసీఆర్.. మూడు రోజులు అక్కడే బస?
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామానికి స్వయంగా కేసీఆర్ ఇంచార్జిగా ఉన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఆ గ్రామంలోనే బస చేసి ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలుస్తున్నది.
మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్నా.. సీఎం కేసీఆర్ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం టీఆర్ఎస్ శ్రేణులను కలవర పెడుతోంది. ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ.. అవసరం అయితే మీడియాతో మాట్లాడుతూ హడావిడి చేసే కేసీఆర్.. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్నారు. దసరా రోజు పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ఆ రోజు విలేకరులతో మాట్లాడతారని భావించినా.. చివరి నిమిషంలో రద్దైంది. ఇక ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు వెళ్లిన కేసీఆర్.. అటునుంచి అటే ఢిల్లీ వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి.. బీఆర్ఎస్ సంబంధిత పనులు చక్కబెడుతున్నారు.
ఒకవైపు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కేసీఆర్ మౌనంగా ఉండటం పట్ల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం త్వరలోనే మునుగోడు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అగస్టు 20న మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలే నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 29 లేదా 30న కేసీఆర్ సభ ఉంటుందని గతంలో పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే త్వరలోనే ఢిల్లీ నుంచి రాబోతున్న కేసీఆర్.. ఈ నెల చివరి వారంలో మునుగోడులోనే ఉంటారని తెలుస్తున్నది.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామానికి స్వయంగా కేసీఆర్ ఇంచార్జిగా ఉన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఆ గ్రామంలోనే బస చేసి ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలుస్తున్నది. అక్కడ బస చేయడానికి వీలు కాకపోయినా.. మూడు రోజుల పాటైతే సీఎం ప్రచారం మాత్రం చేస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ భారీగా బలగాలను మోహరిస్తున్నది. నవంబర్ 3నే పోలింగ్ ఉండటంతో.. ఆ మూడు రోజుల్లో ఒక రోజు బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నది. మునుగోడులో ప్రత్యర్థి పార్టీలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి.
మునుగోడు పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇప్పటికే 30 కంపెనీల పారా మిలటరీ బలగాలు మోహరించనున్నారు. ఇప్పటికే 10 కంపెనీల పారమిలటరీ బలగాలు మునుగోడు చేరుకోగా.. మరో ఒకటి రెండు రోజుల్లో 20 కంపెనీల బలగాలు రానున్నట్లుతెలుస్తున్నది. మరోవైపు తెలంగాణ పోలీస్ బెటాలియన్లు కూడా మునుగోడకు వస్తున్నాయి. మొత్తానికి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడులో రాజకీయ వేడి కూడా పెరుగుతోంది.