బీఆర్ఎస్ విస్తరణపై కీలక చర్చలు.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ మకాం
బీఆర్ఎస్‌కు సంబంధించిన విస్తరణ కార్యక్రమాలపై కూడా కేసీఆర్ దృష్టిపెట్టారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు మరి కొంత మంది ముఖ్య నేతలు ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా నాడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈసీఐ వద్ద పేరు మార్పిడికి సంబంధించిన కసరత్తు చురుకుగా సాగుతోంది. పార్టీ ప్రకటన చేసి వారం రోజులైనా సీఎం కేసీఆర్ మాత్రం ఆ విషయంపై ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. పైగా వారం రోజులుగా బయట కూడా కనపడలేదు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల కోసం మంగళవారం యూపీ వెళ్లారు. అటునుంచి అటే ఢిల్లీకి చేరుకున్నారు. ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్నా.. కేసీఆర్ తన ఫుల్ ఫోకస్ బీఆర్ఎస్ పైనే పెట్టినట్లు తెలుస్తున్నది. తాను ఇంచార్జిగా ఉన్న గ్రామానికి సంబంధించిన వ్యవహారాలను పూర్తిగా ఫోన్‌లోనే చక్కబెడుతున్నారు.
యూపీ నుంచి ఢిల్లీ చేరుకున్న వెంటనే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని సందర్శించారు. రెండు, మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసీతో సందప్రదింపులు జరపడానికి ఇప్పటికే బి. వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. పేరు మార్పు వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ కూడా ఈ రెండు రోజులు ఎన్నికల కమిషన్‌తో చర్చించే అవకాశం ఉన్నది. లేదంటే బి. వినోద్‌కు ఢిల్లీలో ఉండే పలు సూచనలు చేయవచ్చని తెలుస్తున్నది. కేసీఆర్ స్వయంగా ఫాలోఅప్ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక బీఆర్ఎస్‌కు సంబంధించిన విస్తరణ కార్యక్రమాలపై కూడా కేసీఆర్ దృష్టిపెట్టారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు మరి కొంత మంది ముఖ్య నేతలు ఉన్నారు.
బీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించే విషయంపై ఈ రెండు రోజలు చర్చలు జరపనున్నారు. ముందుగా తటస్థంగా ఉన్న పార్టీల నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కొద్దో గొప్పో పేరున్న చిన్న పార్టీల నాయకులతో కేసీఆర్ చర్చిస్తారు. ఆయా పార్టీలను బీఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరనున్నారు. మరోవైపు రైతు సంఘాల నాయకులతో కూడా చర్చించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అనుబంధ శాఖల ఏర్పాటుకు ఢిల్లీలోనే కసరత్తు చేయనున్నారు. బీఆర్ఎస్ కోసం ఇప్పటికే కేసీఆర్ నియమించుకున్న టీమ్ ఢిల్లీలో చురుకుగా పనిచేస్తోంది. ఇక, పార్టీ ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడని కేసీఆర్.. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.