1985 లోనే దళిత బంధు పథకం.. కేసీఆర్ దే ఆ ఘనత.. కేటీఆర్

దళిత బంధు పథకం ఆలోచన ఇప్పటిది కాదని కేటీఆర్ అన్నారు. 1985లోనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఆలోచన చేశారని ఆయన తెలిపారు

Advertisement
Update:2022-07-20 14:25 IST

దళితుల అభివృద్ధి, వారి వికాసంపై అధ్యయనం చేసేందుకు 1985 లో 'దళిత చైతన్య జ్యోతి' కార్యక్రమాన్ని నాడు ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ నిర్వహించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పథకాన్ని పుట్నాలు, బఠాణీల మాదిరి పంచేందుకు పెట్టలేదని, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దీన్ని అర్థవంతంగా అమలు చేయాలన్నది సీఎం కేసీర్ లక్ష్యమని ఆయన చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ని, మోడల్ కెరీర్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపద పునరుత్పత్తి కావాలన్నది దళితబంధు ముఖ్యోద్దేశమని, ఇది తెలియక కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. దశాబ్దాల క్రితమే కేసీఆర్ విప్లవాత్మక పథకాలు రూపు దిద్దుకున్నాయి. 1985 లో సిద్దిపేటకు హరితహారం కార్యక్రమాన్ని నాడు ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ నిర్వహించారు. ఒకే రోజు పదివేల మొక్కలు నాటించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ హరిత హారంగా మారింది అని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఇంటింటికి నీరిచ్చిన ఏకైక ఎమ్మెల్యే కేసీఆర్ అని, 1996-97 లోనే 65 కి.మీ. దూరంలోని దిగువ మానేరు డ్యామ్ నుంచి సిద్దిపేటకు నీటి సరఫరా విషయంలో చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. నాటి 'మంచి నీళ్ల పండుగే' నేడు మిషన్ భగీరథగా తీసుకొచ్చారన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వం పూర్తి ప్రొత్సాన్ని ఇస్తోందని, ఎంటర్ ప్రెన్యూర్లు గా ఎదగాలనుకుంటున్నవారికి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని కేటీఆర్ చెప్పారు.

గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త మిలింద్ కాంబ్లే వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంటకు చెందిన 30 మంది సమిష్టిగా దాదాపు మూడు కోట్ల వ్యయంతో ఫ్యాబ్రికేషన్ యూనిట్, సోడా మేకింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని, ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి పూర్తి ప్రోత్సాహం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు భూమి కేటాయించాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు.





Tags:    
Advertisement

Similar News