కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏమిటో?
రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి తామే వస్తామని, ఇప్పటికన్నా మరో 8 సీట్లు పెరుగుతాయన్న కేసీఆర్ ప్రకటనకు ప్రతిపక్షాలు షాకయ్యాయి.
రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి తామే వస్తామని, ఇప్పటికన్నా మరో 8 సీట్లు పెరుగుతాయన్న కేసీఆర్ ప్రకటనకు ప్రతిపక్షాలు షాకయ్యాయి. నిండు అసెంబ్లీలో కేసీఆర్ ఏ కాన్ఫిడెన్స్‌తో ఇలాంటి ప్రకటన చేశారనే విషయం ప్రతిపక్షాలకు అర్థంకావటంలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 75 సీట్లతో అధికారంలోకి వచ్చేది తామే అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మినిమం 70 సీట్లతో అధికారంలోకి రాబోతోంది కాంగ్రెస్ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే చెబుతోంది.
అధికారం విషయంలో ప్రతిపక్షాలు ఇంత ఊదరగొడుతున్న సమయంలో అధికారం అందుకునే విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటన ప్రతిపక్షాలను అయోమంలోకి నెట్టేసింది. తమ అమ్ములపొదిలో అనేక అస్త్రాలున్నాయని, వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేవని కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందని ప్రతిపక్షాలు పదేపదే చెబుతున్నాయి.
సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న తమ ప్రభుత్వాన్ని కాకుండా జనాలు ఇంకేపార్టీని మళ్ళీ ఎన్నుకుంటారనే ధీమా కేసీఆర్‌లో కనబడుతోంది. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఉద్యోగస్తులకు పే స్కేల్ అమలు చేస్తామన్నారు. అతి తొందరలోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించబోతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)అమలును పరిశీలిస్తున్నట్లు ప్రకటించటం కూడా కచ్చితంగా ఉద్యోగుల్లో సానుకూలత పెంచేవే అనటంలో సందేహంలేదు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. ఇది సుమారు 27 లక్షల రైతు కుటుంబాలకు సంతోషాన్నిచ్చే విషయమే.
పరిశ్రమలు, ఐటి, రియల్ ఎస్టేట్ రంగాలు మంచి ఊపుమీదున్నాయి. వీటి వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది. మెట్రోను అన్నీ వైపులకు విస్తరించబోతున్నట్లు అసెంబ్లీలోనే కేటీఆర్ ప్రకటించారు. దీనివల్ల నగర శివారు ప్రాంతాల్లోని జనాలు హ్యాపీ అవుతారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల్లో అనైక్యత కేసీఆర్‌కు అతిపెద్ద బలంగా మారే అవకాశాలున్నాయి. ఇక ఎంఐఎంతో దోస్తీ బీఆర్ఎస్‌కు అదనపు బలమనే చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓట్లు ఎంఐఎం కారణంగా బీఆర్ఎస్‌కు పడతాయి. మొత్తానికి హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ చాలా కాన్పిడెంటుగా ఉన్నారని అర్థమవుతోంది.