సిట్టింగ్‌లకే సీట్లు.. కేంద్రంలోనూ పాగా వేస్తాం - కేసీఆర్

ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. దళితబంధు, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారికి జరిగిన మంచిని విడమరచి చెప్పాలన్నారు.

Advertisement
Update:2022-09-04 07:50 IST

వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ఆయా సీట్లు ఇవ్వాలన్నది తన విధానం అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. సిట్టింగ్ లకే సీట్లు ఇవ్వడం ఖాయమే అయినా కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు కేసీఆర్.

తెలంగాణలోనూ గడప గడపకు..

ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. దళితబంధు, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారికి జరిగిన మంచిని విడమరచి చెప్పాలన్నారు. మనం చేసిన కార్యక్రమాలను, మనమే ప్రచారం చేసుకోకపోవడంతో అయోమయం ఏర్పడుతోందన్నారు. కేడర్‌ తో పొరపొచ్ఛాలు రాకుండా వారితో కలసి వన భోజనాలు చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు కేసీఆర్. కేబినెట్ భేటీ అనంతరం శాసన సభాపక్ష, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశంలో పాల్గొన్న ఆయన.. నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ ని ఖాళీ చేసి నియోజకవర్గాలపై దృష్టిపెట్టాలని సూచించారు.

కేంద్రంలోనూ పాగా..

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సమయంలో.. కొందరు మన పార్టీ తరపున ఎమ్మెల్యేలవుతారు, వారిలో కొందరు మంత్రులవుతారు అని చెబితే అప్పట్లో నాయకులెవరూ నమ్మలేదని అన్నారు కేసీఆర్. ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి కూడా అలాగే చెబుతున్నానని అన్నారు. 'మనం జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం ఖాయం. మనం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మీలో చాలా మందికి రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు, గవర్నర్లు, విదేశీ రాయబారులుగా అవకాశం లభిస్తుంది'అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

జాతీయ స్థాయిలో దళిత సదస్సుకి ఏర్పాట్లు..

జాతీయ రైతు సంఘాలతో ఇటీవల ఏర్పాటు చేసిన భేటీకి మంచి స్పందన లభించిందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దేశవ్యాప్త మద్దతు లభించిందని అన్నారు కేసీఆర్. దళితబంధు పథకం గురించి తెలిసిన యూపీ రైతు నాయకుడు కన్నీరు పెట్టుకున్నారని, ఇలాంటి అద్భుత పథకం దేశమంతా అమలు కావాలన్నారని చెప్పారు. రైతు సంఘాల భేటీ తరహాలో త్వరలో జాతీయ స్థాయిలో దళిత సంఘాల ప్రతినిధులతోనూ సదస్సు నిర్వహిస్తామని అన్నారు.

బీజేపీ ఫెయిల్..

సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చగలిగిందని, కానీ ఢిల్లీ, బీహార్ లో మాత్రం ఫెయిలైందని, సీబీఐని ఉసిగొల్పి నాయకుల్ని బెదిరించే ప్రయత్నాలు తెలంగాణలో కూడా జరుగుతాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. జాతీయస్థాయిలో భాగస్వామ్య పార్టీలు దూరమై బీజేపీ ఏకాకిగా మారిందని అన్నారు కేసీఆర్. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో కేవలం మత ఛాందస వాదాన్ని నమ్ముకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారాయన. తెలంగాణకు ఏం చేశారో చెప్పలేని కేంద్ర మంత్రులు, మోదీ ఫొటోలు లేవంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతకు మించి చెప్పేందుకు బీజేపీ వద్ద ఏమీ ఉండదని, బీజేపీ మత పిచ్చి రాజకీయాలపట్ల గతంలో కొంత హడావిడి జరిగినా, ఇప్పుడా పార్టీని పట్టించుకునేవారే లేరన్నారు కేసీఆర్.

టార్గెట్ మునుగోడు..

మునుగోడు ఉప ఎన్నికలో సర్వేలన్నీ టీఆర్ఎస్ దే గెలుపు అంటున్నాయని, బీజేపీకి మూడో స్థానమే దిక్కు అని అన్నారు కేసీఆర్. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఉప ఎన్నిక కోసం రెండు గ్రామాలకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున బాధ్యతలు అప్పగిస్తామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేయాలన్నారు కేసీఆర్. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను కొట్టిపారేశారాయన. నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఎమ్మెల్యేలకు అందజేసిన కేసీఆర్.. ఒక్కో నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం 3వేలమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, దళితబంధుకోసం 500మందిని ఎంపిక చేయాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News