మొరాయించిన హెలికాప్టర్.. రోడ్డు మార్గాన కేసీఆర్
సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే పైలెట్ దాన్ని ఆపివేశారు. ప్రయాణం సురక్షితం కాదని తేల్చి చెప్పారు. దీంతో కాగజ్ నగర్ నుంచి కేసీఆర్ రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ బయలుదేరి వెళ్లారు.
సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ అక్కడే వదిలేసి ఆయన రోడ్డు మార్గాన ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణానికి వెళ్లారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. కాగజ్ నగర్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే పైలెట్ దాన్ని ఆపివేశారు. ప్రయాణం సురక్షితం కాదని తేల్చి చెప్పారు. దీంతో కాగజ్ నగర్ నుంచి కేసీఆర్ రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ బయలుదేరి వెళ్లారు.
ఇది రెండోసారి..
సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడం ఇది రెండోసారి. ఇటీవల దేవరకద్ర బయలుదేరే సమయంలో కూడా హెలికాప్టర్ మొరాయించింది. ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్ దాన్ని తిరిగి అక్కడే దించారు. ఆ తర్వాత కొత్త హెలికాప్టర్ తీసుకొచ్చారు. అందులో సీఎం కేసీఆర్ ప్రచారానికి బయలుదేరారు. అయితే ఆరోజు కేసీఆర్ షెడ్యూల్ 5 గంటలు ఆలస్యమైంది. కొత్త హెలికాప్టర్ తీసుకొచ్చే క్రమంలో ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి అయింది. అధికారుల అనుమతి తీసుకుని కొత్త హెలికాప్టర్ తెప్పించి అందులో బయలుదేరారు సీఎం కేసీఆర్. ఈరోజు రెండోసారి ఆయన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
హెలికాప్టర్ మొరాయించడంతో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ కి బయలుదేరి వెళ్లారు సీఎం కేసీఆర్. ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ తర్వాత ఈరోజు బెల్లంపల్లిలో కూడా ప్రజాఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్.