ఢిల్లీలో కేసీఆర్ బిజీ.. అఖిలేశ్ యాదవ్, ప్రశాంత్ కిశోర్‌తో భేటీ
తాజాగా దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. శుక్రవారం ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్‌తో సమావేశం అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ముందుగా రాష్ట్రానికి రావల్సిన నిధులపై దృష్టిపెట్టారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తూ నిధులకు సంబంధించిన ఫైళ్లపై కదలికి తీసుకొని వచ్చారు. ఇక తాజాగా దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. శుక్రవారం ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్‌తో సమావేశం అయ్యారు.
ముందుగా అఖిలేశ్‌కు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. ఆ తర్వాత రెండు గంటల పాటు రాజకీయ చర్చలు జరిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇటీవల ప్రతిపక్షంలోని ముఖ్య నేతలను ఈడీ ద్వారా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని వరుసగా మూడు రోజుల పాటు ఈడీ విచారించడం.. పశ్చిమ బెంగాల్‌లోని మంత్రి పార్థా చటర్జీ నివాసాలపై దాడులపై కూడా చర్చించారు. ఢిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేంత్ర జైన్‌ను కూడా ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఐ-టీ శాఖల ద్వారా ఎన్డీయే కూటమి ఇబ్బంది పెడుతోందని.. దీనిపై చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గాలకు సంబంధించి ఐ-ప్యాక్ చేసిన సర్వే రిపోర్టును కేసీఆర్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇరువురు మరోసారి చర్చించినట్లు సమాచారం. ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయంపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే సమయంలో ఎన్నికలకు వెళ్తే టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందా లేదా అనే విషయంపై పీకేతో పాటు జాతీయ నాయకులతో కూడా చర్చించినట్లు సమాచారం.
కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కేసీఆర్ తన షెడ్యూల్‌ను మార్చుకొని కేవలం జాతీయ ప్రతిపక్ష నాయకులతో భేటీకే పరిమితం అయ్యారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పెరుగుతుండటం, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గాయంతో ఇంటికే పరిమితం కావడంతో.. కేసీఆర్ త్వరగా హైదరాబాద్ వస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.