కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం
భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తన సినిమాల్లో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ (92) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, విశ్వనాథ్ మృతిపట్ల తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అతి సామాన్యమైన కథనైనా తన అద్భుత ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకుడు కే. విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్ అన్నారు.
భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తన సినిమాల్లో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుపు నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు విశ్వనాథ్ అని సీఎం పేర్కొన్నారు.
గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆయన ఇంటికి వెళ్లి కేసీఆర్ పరామర్శించారు. ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై మా మధ్య మంచి చర్చ జరిగిందంటూ ఆ విషయాలను సీఎం కేసీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను విశ్వనాథ్ అందుకోవడం ఆయన దర్శక ప్రతిభకు నిదర్శనమని సీఎం అభివర్ణించారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కే. విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని కేసీఆర్ అన్నారు.
కవి పండితులకు జనన మరణాలు ఉండవు.. వారి కీర్తి అజరామరం అనే వాక్కు విశ్వనాథ్‌కు అక్షరాలా వర్తిస్తుందని కేసీఆర్ తెలిపారు.
కె. విశ్వనాథ్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. విశ్వనాథ్ కుటుంబానికి, అనేక మంది అభిమానులకు తన సంతాపం తెలియజేశారు.అనేక అద్భుతమైన చిత్రాలను నిర్మించిన దర్శకుడిగా ఎంతో కాలం ఆయన గుర్తుండిపోతారని కేటీఆర్ అన్నారు. విశ్వనాథ్ సినిమాలు ఎన్నో తరాలకు స్పూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు.