గ్రూప్‌-1 అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచన. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

Advertisement
Update:2024-10-21 14:13 IST

గ్రూప్‌-1 పరీక్షల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి 27 తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల్లో విజయం సాధించి రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

గ్రూప్‌-1 పరీక్ష నిలుపుదల కుదరదు: సుప్రీంకోర్టు 

మరోవైపు గ్రూప్‌-1 పరీక్షల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంత ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించారు. తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పిందని సీజేఐ గుర్తుచేశారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 పరీక్ష జరుగుతున్నదని, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తెచ్చిందని అభ్యర్థుల తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. పరీక్షపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు గ్రూప్‌-1 పరీక్ష నిలుపుదల కుదరదని స్పష్టం చేసింది.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్‌ కు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాటు చేశారు. అధికారులు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షకు అనుమతించకపోవడంతో అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News