లెక్క తేలినట్టే.. గ్యాస్ రాయితీ 40 లక్షల మందికే!
రేషన్ కార్డు ఉన్నది సుమారు 90 లక్షల మందికి. సివిల్ సప్లయిస్ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం ఇందులో 39.50 లక్షల మందికి మాత్రమే 500 రూపాయల సిలిండర్ పథకానికి అర్హత ఉంది.
కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఒకటైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల లెక్క తేల్చడానికి సివిల్ సప్లయిస్ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్యాస్ డీలర్లంతా ఈ పథకం అమలుకు సిద్ధమవ్వాలని ఆదేశించిన అధికారులు మొత్తం లబ్ధిదారులు ఎంత మంది ఉంటారనేది లెక్క తేల్చే పనిలో పడ్డారు.
మొత్తం కోటీ 20 లక్షల కనెక్షన్లు
ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్ కార్డు ఉన్నది సుమారు 90 లక్షల మందికి. సివిల్ సప్లయిస్ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం ఇందులో 39.50 లక్షల మందికి మాత్రమే 500 రూపాయల సిలిండర్ పథకానికి అర్హత ఉంది.
సర్వే తర్వాత కాస్త పెరగొచ్చు
ప్రస్తుతం దీనిపై ఇంటింటి సర్వే జరుగుతోంది. తర్వాత లబ్ధిదారుల సంఖ్య ఇంకొంత పెరగవచ్చు. ఎంత చేసినా ఈ సంఖ్య 45 లక్షలకు మించకపోవచ్చని సివిల్ సప్లయిస్ అధికారుల అంచనా. 500కే గ్యాస్ సిలిండర్ అని ప్రచారం చేసిన కాంగ్రెస్, అమల్లోకి వచ్చేసరికి మూడో వంతు మందికే ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.