హైదరాబాద్‌లో చుడీదార్ గ్యాంగ్.. S.R.నగర్ పరిధిలో చోరీ
ఈనెల 18న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఒంగోలుకు వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి.. తాళం పగులగొట్టి ఉండడం గుర్తించి వెంకటేశ్వర రావుకు సమాచారం ఇచ్చింది.
ఇప్పటివరకూ మనం చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి విన్నాం, చూశాం. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త రకం గ్యాంగ్ దిగింది. అదే చుడీదార్ గ్యాంగ్. మగవాళ్లే ఆడవాళ్లలా చుడీదార్ ధరించి, ముఖానికి పూర్తిగా ముసుగు కప్పుకొని దొంగతనాలు చేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం చేసి వెళ్తుండగా.. చుడీదార్ గ్యాంగ్‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
కె. వెంకటేశ్వర రావు అనే ప్రైవేట్ ఉద్యోగి.. S.R. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ కాలనీలో ఆకృతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఈనెల 18న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఒంగోలుకు వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి.. తాళం పగులగొట్టి ఉండడం గుర్తించి వెంకటేశ్వర రావుకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంకటేశ్వర రావు హైదరాబాద్‌కు వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు చుడీదార్, మాస్క్‌లు ధరించిన దుండగులు అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డట్లు గుర్తించారు. నాలుగు తులాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు, లాప్‌టాప్ చోరీ అయినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చుడీదార్ గ్యాంగ్‌కు చెడ్డీ గ్యాంగ్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయంటున్నారు.