హాట్ కేకుల్లా చోటా నాయకులు.. డిమాండ్‌ను బట్టి రేటు!
ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఇలాంటి చోటా మోటా నాయకులపై కన్నేశాయి.
ఏ పార్టీకైనా జెండా పట్టాలన్నా.. దిమ్మె కట్టాలన్నా.. పది మందిని పోగేయాలన్నా.. నలుగురితో ఓటేయించాలన్నా చోటా నాయకులే దిక్కు. ద్వితీయ శ్రేణో, క్షేత్రస్థాయో.. ఏ పేరు పెట్టుకున్నా.. ఈ నాయకులు లేనిదే రాజకీయం లేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చోటా మోటా నాయకులదే హవా. అందుకే టికెట్ తెచ్చుకోగానే సరిపోదు.. సరైన లీడర్లను కాపాడుకొని.. వారి సేవలను వాడుకోవడం ఏ పార్టీ నాయకుడికైనా ముఖ్యమే.
ఇటీవల సీఎం కేసీఆర్ ఒక సమావేశంలో.. 2018లో ఓ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడో చెప్పారు. ఒక చిన్న నాయకుడు అలిగి మాట్లాడటం లేదు. సదరు నాయకుడి ఇంటి వెళ్లి కాస్త బుజ్జగించి రావాలని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. మూడు వందల ఓట్లున్న అతడి దగ్గరకు నేను పోవడం ఏంటని సదరు ఎమ్మెల్యే అభ్యర్థి మంకు పట్టుపట్టాడు. చివరకు ఆ బలమైన ఆ నాయకుడు ఓడిపోవల్సి వచ్చింది. ఈ చిన్న ఉదాహరణ చాలు.. కింది స్థాయి నాయకుల పవర్ ఏంటో చెప్పడానికి. అందుకే చిన్న నాయకులను కాపాడుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరిక లాంటి సూచన చేశారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఇలాంటి చోటా మోటా నాయకులపై కన్నేశాయి. ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారిని తమ పార్టీలోకి గుంజేయడానికి రెడీగా ఉన్నాయి. ఒక ఎంపీటీసీనో, ఒక సర్పంచో లేదంటే కార్పొరేటర్ పార్టీలోకి వస్తే వార్తల్లో పెద్దగా కనపడవు. కానీ వాళ్లే ఎన్నికల వేళ అత్యంత కీలకం అనే విషయం అన్ని పార్టీలకు తెలుసు. ఇటీవల ఖమ్మం, నల్గొండలో భారీగా చోటా మోటా నాయకులు పార్టీలు మారారు. తమ గెలుపు కోసం పాత పరిచయాలను ఉపయోగించుకొని వారిని పార్టీలో చేర్చుకున్నట్లు పైకి కనిపించింది. కానీ గ్రామ స్థాయి నేతలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నజరానాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
మండల స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులు, కనీసం 500 ఓట్లు వేయించగలిగే సత్తా ఉన్న వారితో ప్రత్యేక ప్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి రూ.20 లక్షల వరకు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు వెనుకాడటం లేదు. ఇప్పటికే దక్షిణ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని పలువురు చోటా నాయకులకు తాయిలాలు అందాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొంత మంది చోటా లీడర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు కూడా కట్టబెడతామనే హామీలు ఇస్తున్నారు. మామూలు రోజుల్లో ఎలాగో పట్టించుకోరు.. ఈ కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సాధ్యమైనంత రాబట్టుకోవాలనే ఆలోచనలో చోటా లీడర్లు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నా సరైన గుర్తింపు రాని నాయకులు మాత్రం.. పదవి హామీ ఇస్తేనే పని చేస్తామని గట్టిగానే చెప్తున్నారు. డబ్బు ఎలాగైనా సంపాదించుకోగలం.. కనీసం ఇప్పుడైనా పదవులు ఇవ్వాలని కోరే వాళ్లు కూడా ఎక్కువయ్యారు.
మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా చోటా మోటా లీడర్లకు ఇప్పుడు భారీగా డిమాండ్ పెరిగింది. బూత్ స్థాయిలో ప్రభావితం చేయగలిగే వారి నుంచి మండలంలో ఇన్‌ఫ్లూయెన్స్ చేసే నాయకుల వరకు అందరూ హాట్ కేకుల్లా మారిపోయారు. ఏ మాత్రం అసంతృప్తితో ఉన్నా.. ప్రత్యర్థి పార్టీలు వారిని గుంజేయడానికి రెడీగా ఉన్నాయి.