కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. చిత్రపురి కాలనీ సెన్సేషన్
జర్నలిస్ట్ లు ఎన్నో వార్తలు రాస్తుంటారని, వారి ఫోన్లు కూడా సీజ్ చేస్తారా అని ప్రశ్నించారు క్రిశాంక్. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
చిత్రపురి సిటీ భూదందాపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు తన ఫోన్‌ను మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారని చెప్పారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్. సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆయన కోరారు. అసలు మొబైల్ ఫోన్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇదెక్కడి సంస్కృతి అన్నారు. మీడియాలో వచ్చిన విషయాలనే తన పోస్టుల్లో ప్రస్తావించానని, రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన అనుముల మహానందరెడ్డిపై విచారణ చేపట్టాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.
జర్నలిస్ట్ లు ఎన్నో వార్తలు రాస్తుంటారని, వారి ఫోన్లు కూడా సీజ్ చేస్తారా అని ప్రశ్నించారు క్రిశాంక్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ తమపై కేసులు పెడుతున్నారని, గతంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమైనట్టు రాసిన పత్రికపై ఆయనే కేసు వేశారన్నారు క్రిశాంక్. చంద్రబాబుతో రేవంత్ సమావేశం గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది పోయి కేసులు వేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు క్రిశాంక్.
క్రిశాంక్ ఫోన్ ని పోలీసులు సీజ్ చేసిన వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఘాటుగా స్పందించారు. చిత్రపురి సిటీలో రూ. 3 వేల కోట్ల భూదందా జరిగిందని ఆరోపణ వస్తే దానిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, ఆధారాలతో స్పందించాలని.. అది చేయకుండా దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి, సెల్‌ఫోన్‌ను సీజ్ చేయడం సరికాదని మండిపడ్డారు. ఆధారాలు చూపెట్టకుండా ఆరోపణలు చేసిన వారిని ఇబ్బంది పెడుతున్నారంటే.. కుంభకోణం బరాబర్ జరిగిందని అర్థమవుతోందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ పన్నాగాలు అని అన్నారు. బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల డబ్బు తీసుకుని పోయే గ్యాంగ్ ల లాగా తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్.