ఫారిన్ కరెన్సీ బదులు చీకోటి కరెన్సీ.. ఈడీ విచారణలో షాకింగ్ నిజాలు..

రెండు రోజులుగా ఈడీ ఎదుట హాజరవుతున్న చీకోటి ప్రవీణ్ నుంచి అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది. ఫారిన్ కరెన్సీ బదులు చీకోటి కరెన్సీ ద్వారా హవాలా రూపంలో నగదు లావాదేవీలు జరిగేవని నిర్ధారించారు.

Advertisement
Update:2022-08-02 15:18 IST

విదేశాల్లో క్యాసినో ఆడేందుకు వెళ్తున్న బడా బాబులు, పందెంలో గెలుచుకున్న సొమ్ముని భారత్ కి ఎలా తరలిస్తున్నారనే విషయాన్ని ఇప్పటి వరకూ ఈడీ అధికారులు శోధించారు. అయితే ఇక్కడ ఫారిన్ కరెన్సీ బదులు చీకోటి కరెన్సీ అనేది ఉందని, దాని ద్వారానే హవాలా రూపంలో నగదు లావాదేవీలు జరిగేవని నిర్ధారించారు. రెండు రోజులుగా ఈడీ ఎదుట హాజరవుతున్న చీకోటి ప్రవీణ్ నుంచి అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది.

విదేశాలకు వెళ్లే ముందే టోకెన్లు..

క్యాసినో ఆడేందుకు విదేశాలకు వెళ్లేవారు ముందుగా చీకోటి ప్రవీణ్ వద్ద డబ్బులు డిపాజిట్ చేసి టోకెన్లు తీసుకునేవారు. వాటితో అక్కడికి వెళ్లి క్యాసినో ఆడేవారు. అక్కడ డబ్బులు పోగొట్టుకుంటే టోకెన్లు కూడా పోతాయి, డబ్బులు వస్తే వాటి స్థానంలో నగదుగా మార్చుకునే టోకెన్లను ఇస్తారు. తిరిగి భారత్ కి వచ్చాక ఆ టోకెన్లు జమ చేసి వాటికి బదులు నగదు తీసుకుంటారు. ఇలా హవాలా రూపంలో క్యాసినో నగదు మారకం జరిగేదని చీకోటి ద్వారా అధికారులు సమాచారం రాబట్టారు.పెద్ద మొత్తంలో ఫారిన్ కరెన్సీని తీసుకెళ్లేందుకు కానీ, తీసుకొచ్చేందుకు కానీ అనుమతి లేదు కాబట్టి, కాయిన్ల రూపంలో చీకోటి కరెన్సీ చలామణి అవుతోంది.

చీకోటి పేరుతో ఫేక్ అకౌంట్ల గోల..

మరోవైపు చీకోటి ప్రవీణ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఆయా అకౌంట్ల నుంచి కొంతమంది రాజకీయ నాయకుల్ని బెదిరించేలా సందేశాలు ఉంచుతున్నారు. అయితే ఆ అకౌంట్లకి తనకు సంబంధం లేదంటున్నారు చీకోటి. తన పేరుతో తప్పుడు అకౌంట్లు సృష్టించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీఎస్ లో ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

మీడియాపై చిందులు..

"మీరే అంతా చేస్తున్నారు, మీరే తప్పుడు కథనాలు రాస్తున్నారు, నా పరువు తీస్తే మీకేమొస్తుంది.." అంటూ మీడియాపై చిందులు తొక్కారు చీకోటి ప్రవీణ్. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు, బయటకొచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు ఇలా తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకోవాలని చూశారు. మీడియా సంస్థలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు చీకోటి.

Tags:    
Advertisement

Similar News