చెన్నమనేని కూల్.. కేసీఆర్ తో మీటింగ్

ఆరు ద‌శాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధిగమించామని చెప్పారు చెన్నమనేని. కేవలం దశాబ్ది కాలంలోపే కష్ట నష్టాలు తొలగిపోయాయన్నారు.

Advertisement
Update:2023-08-30 18:08 IST

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఎట్టకేలకు కూల్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయనను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ రంగ వ్యవహారాలకు సంబంధించి ప్రధాన సలహాదారుగా నియమించారు సీఎం కేసీఆర్. అప్పటికీ ఆయన గరం గరంగానే ఉన్నారనే వార్తలొచ్చాయి. బహిరంగంగా ఎక్కడా ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా చెన్నమనేని అంతరంగం తెలిసినవారు మాత్రం ఆయన కోపం చల్లారలేదనే అనుకున్నారు. ఎట్టకేలకు ఆయన ఇప్పుడు కూల్ అయ్యారు. సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిశారు. సలహాదారు పదవి ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.


పార్టీ టికెట్లు దక్కనివారు నిరాశ చెందొద్దని, అందరికీ న్యాయం చేస్తామని ఆల్రడీ సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ మాట ప్రకారం ఒక్కొక్కరికీ పదవులు కేటాయిస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. చెన్నమనేని రమేష్ కి సలహాదారు పదవి ఇచ్చారు. మిగతా వారి విషయంలో కూడా సమయం చూసి పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు కొందరు ఆవేశపడుతున్నారు. చెన్నమనేని కూడా అలాగే ఆవేశపడతారనే అంచనాలున్నాయి. సలహాదారు పదవి వచ్చినా కూడా ఆయన కోపం చల్లారలేదనే వార్తలొచ్చాయి. ఆ అపోహలన్నీ ఇప్పుడు దూదిపింజల్లా తేలిపోయాయి.

ఆరు ద‌శాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధిగమించామని చెప్పారు చెన్నమనేని. కేవలం దశాబ్ది కాలంలోపే కష్ట నష్టాలు తొలగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలులో, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండో దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమవుతున్న సమయంలో సీఎం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తో చెన్నమనేని భేటీ తర్వాత వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయిందనే చెప్పుకోవాలి. చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇప్పుడు వేములవాడ నుంచి పోటీ చేయబోతున్నారు.


Tags:    
Advertisement

Similar News