జూన్ 1 నుంచి ఈవీఎంల చెకింగ్.. తెలంగాణలో మొదలైన ఎన్నికల ఏర్పాట్లు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని, ఇప్పటి వరకు ఈసీఐ నుంచి అలాంటి సమాచారం ఏదీ రాలేదని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబర్‌కు పూర్తవుతుంది. దీంతో నిర్ణీత సమయానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించిందని తెలిపారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని, ఇప్పటి వరకు ఈసీఐ నుంచి అలాంటి సమాచారం ఏదీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. జనవరి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. సాంకేతికంగా అసెంబ్లీ ఎన్నికల పనులు ప్రారంభమైనట్లే అని వికాస్ రాజ్ చెప్పారు. పోల్ షెడ్యూల్ వివరాలు ఈసీఐ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు.
ఇటీవల ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర అధికారులతో భేటీ అయ్యారు. అలాగే వికాస్ రాజ్ కూడా ఢిల్లీ వెళ్లి ఈసీఐ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఈసీఐ కొత్త పద్దతులను ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది. వీటికి సంబంధించిన వివరాలను అన్ని రాష్ట్రాల సీఈవోలకు తెలియజేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ఢిల్లీ వెళ్లిన వికాస్ రాజ్‌కు అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలని చెప్పినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే ముగ్గురు సభ్యుల ఈసీఐ బృందం.. తెలంగాణలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకున్నారు. అలాగే ఈ సారి ఓటింగ్ శాతం పెంచడానికి తీసుకోవల్సిన చర్యలను కూడా వివరించారు. ఏప్రిల్ 15న సీనియర్ డిప్యుటీ ఎలక్షన్ కమిషనర్ నితేశ్ వ్యాస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో.. ఓటర్ల లిస్టులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో రిటర్నింగ్ అధికారుల లిస్టును వెంటనే సిద్ధం చేయాలని సీఈవో వికాస్ రాజ్‌ను ఆయన ఆదేశించారు.
ఇక జూన్ 1 నుంచి మొదటి దశ ఈవీఎం చెకింగ్ ప్రారంభం కానున్నది. రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని ఈవీఎంలను పరిశీలించి.. సరిగా పని చేయని వాటిని ఈసీఐఎల్, బీఈఎల్‌లకు పంపనున్నారు. అలాగే వీవీ ప్యాట్ మెషిన్ల పని తీరు కూడా పరిశీలించనున్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని ఈవీఎం, వీవీ ప్యాట్‌ల తనిఖీలు పూర్తి చేసి.. ఇంకా అదనంగా కావల్సి ఉంటే ఈసీఐకి తెలియజేయాలని చెప్పారు. మరో వైపు జిల్లా ఎన్నికల అధికారులకు కూడా రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
ఈసీఐఎల్ నుంచి వచ్చిన ఈవీఎంలు ఇప్పటికే జిల్లాలకు తరలించినట్లు సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. పాత, కొత్త ఈవీఎంల పరిశీలన జూన్ 1 నుంచే జిల్లాల వారీగా జరుగుతుందని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.