రైతులను మోసం చేసి రైతు పండుగా?
మహబూబ్‌నగర్ కార్యక్రమంలో రైతుబంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్
రైతుబంధును రూపుమాపే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు. రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమేనని అన్నారు. రైతుబంధుకు ఏడాదికి రూ. 7,500 కోట్లు జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాలకు రూ. 15 వేలు చెల్లిస్తే ఇంకా ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.
రైతుబంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుందో చెప్పాలి? రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు మోసపోయినట్లేనా? వారిని విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండగ నిర్వహిస్తున్నారా? అన్నదాతలను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా? అని ప్రశ్నలు సంధించారు. మహబూబ్‌నగర్ కార్యక్రమంలో రైతుబంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.