పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

రైలు స్టేషన్‌కు చేరుకుంటున్న సమయం కావడంతో రైలు దిగేందుకు అప్పటికే నిలబడి ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా రైలు కుదుపులకు గురవడంతో కంగారుపడ్డారు.

Advertisement
Update:2024-01-10 11:36 IST

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం 8.40 గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాం పైకి చేరుకునే సమయంలో సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఈ ఘటనలో ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి లోకో పైలట్‌ తప్పిదమే కారణంగా రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో రైలు నెమ్మదిగా కదులుతుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై హైదరాబాద్‌ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందిస్తూ గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి.. రైలు ప్లాట్‌ఫాంకి చేరుకునేందుకు నెమ్మదిగా వస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.

ఊహించని ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు స్టేషన్‌కు చేరుకుంటున్న సమయం కావడంతో రైలు దిగేందుకు అప్పటికే నిలబడి ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా రైలు కుదుపులకు గురవడంతో కంగారుపడ్డారు. ఏం జరుగుతోందో అర్థంగాక పలువురు కేకలు పెట్టారు. దీంతో రైలులోని బోగీలన్నీ ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయాయి. పెద్దగా ప్రమాదం లేకపోవడంతో ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    
Advertisement

Similar News