తెలంగాణపై మళ్లీ చంద్రబాబు చూపు.. ఆ దిశగా టీడీపీ అడుగులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రస్తావించని చంద్రబాబు.. ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతూ వచ్చింది. విభజనకి ముందు నుంచే రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలబించిన చంద్రబాబు.. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు అదే పంథాన్ని కొనసాగించారు. కానీ 2014లో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో నెమ్మదిగా టీడీపీ ప్రాభవం తగ్గుతూ వెళ్లింది. ఆ తర్వాత ఓటుకి నోటు కేసులో టీడీపీ అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు ఏపీకి వెళ్లి సెటిలైపోయారు. దాంతో నాయకులు వేరే పార్టీలోకి వెళ్లిపోగా.. క్యాడర్ చెదిరిపోయింది. ఓవరాల్‌గా తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది.
కానీ.. గత కొన్ని నెలలుగా తెలంగాణలో మళ్లీ టీడీపీ యాక్టీవ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు తీసుకుని కేడర్‌ని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు బ్యానర్లు, కటౌట్లు అక్కడక్కడ హైదరాబాద్‌లో దర్శనమిస్తున్నాయి. అలానే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకి చాలా మందికి ఆహ్వానాలు వెళ్లాయి. కానీ పెద్దగా రాజకీయ నాయకుల హడావుడి మాత్రం కనిపించలేదు. అయితే సినిమా హీరోలు మాత్రం సందడి చేశారు. అలానే జన సమీకరణలోనూ కాసాని జ్ఞానేశ్వర్‌కి మంచి మార్కులే పడ్డాయి. దాంతో మళ్లీ చంద్రబాబుకి ఆశలు చిగురించినట్లున్నాయి. చాలా రోజుల తర్వాత రెండు కళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రస్తావించని చంద్రబాబు.. ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అప్పట్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పింది ఆయనే అలానే విడగొట్టాలని సూచించింది కూడా ఆయనేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో టీడీపీ తరఫున కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా పోటీచేయాలనేది టీడీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.