ఎక్కడున్నా సరే ప్రజా గాయకుడు గద్దర్ ఆత్మ భోరుమనటం ఖాయం. చనిపోయారు కాబట్టి సరిపోయింది కాని అదే బతికున్నపుడు ఈ మాటలు వినుంటేనా? ఇంకేమన్నా ఉందా? ఇంతకీ విషయం ఏమిటంటే నివాళులు అర్పించటానికి గద్దర్ ఇంటికి చంద్రబాబునాయుడు వెళ్ళారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు గద్దర్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అంతటితో చంద్రబాబు ఆగకుండా తామిద్దరి లక్ష్యం ఒక్కటేనన్నారు.
మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే అని చెప్పారు. ఇంతకీ ఆ లక్ష్యం ఏమిటంటే పేదల కోసం పోరాటాలు చేయటమట. బతికున్నంతకాలం గద్దర్ పేదల సంక్షేమం కోసమే పోరాటాలు చేసినట్లు చెప్పిన చంద్రబాబు గద్దర్ ఆశయాలను టీడీపీ కొనసాగిస్తుందని చెప్పటంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పేదలపక్షంగా గద్దర్ పోరాటాలు చేశారంటే ఎవరూ కాదనలేరు. మరి చంద్రబాబు ఎప్పుడు పేదల పక్షాన నిలబడ్డారో ఎవరికీ అర్థంకాలేదు. గద్దర్ లేకపోయినా ఆయన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుందట.
ఆ స్ఫూర్తిని తాను కొనసాగిస్తానని చంద్రబాబు చెప్పటమే వినేవాళ్ళకు ఎబ్బెట్టుగా అనిపించింది. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నపుడు పేదల సంక్షేమం కోసం చంద్రబాబు చేసిన పని ఒక్కటి కూడా లేదు. చంద్రబాబు పాలనలో ఉంటే చుట్టూ ఎవరుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. పేదల సంక్షేమం కోసం తామిద్దరం కలిసి పనిచేసినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇక గద్దర్ మీద కాల్పులు జరిగిన విషయమై మాట్లాడుతూ.. ఈ విషయంలో అందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని బాధపడిపోయారు.
గద్దర్ మీద 1997లో కాల్పులు జరిపించింది చంద్రబాబే అని అందరికీ తెలుసు. ఈ విషయం ఎవరో చెప్పటం కాదు స్వయంగా గద్దరే చాలాసార్లు చెప్పారు. అలాంటిది చంద్రబాబు కాల్పులు జరిపినట్లు దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మొత్తం మీద గద్దర్ లక్ష్యం తన లక్ష్యం ఒకటే అని, తామిద్దరం పేదల పక్షాన పోరాటాలు చేశామని, చాలాకాలం కలిసి పనిచేశామని చంద్రబాబు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.