పోటీ చేద్దామా?మద్దతు ఇద్దామా? ఉపఎన్నికపై తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు
మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేద్దామంటూ కొందరు సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటికే ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు.
ఇన్నాళ్లూ తెలంగాణ వైపు చూడటానికి కూడా సంశయించిన చంద్రబాబు.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత రూటు మార్చారు. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతకు ముందే అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నట్లు సమాచారం. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేద్దామంటూ కొందరు సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటికే ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు.
మరో మూడు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నది. దీంతో పోటీపై త్వరగా తేల్చేయాలని చంద్రబాబుపై టీటీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడింది. అప్పటికీ పార్టీలోనే ఉన్న చాలా మంది సీనియర్లను సీఎం కేసీఆర్ తన పార్టీలోకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు టీడీపీలో చెప్పుకోదగిన నాయకుడు అంటూ ఎవరూ మిగల్లేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఇంకా తెలంగాణలో రాజకీయం చేయాలని అనుకుంటుందా లేదా అనే సందేహాలు పార్టీ కార్యకర్తల్లోనే ఉన్నాయి. అలాంటి సమయంలో మునుగోడులో పోటీ ఏ మేరకు పార్టీ బలోపేతానికి సహాయపడుతుందని చంద్రబాబు అంచనాలు వేస్తున్నారు.
టీడీపీకి బీసీ ఓటర్లలో మంచి పట్టు ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉండేది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలా మంది ప్రజాప్రతినిధులు ఒకప్పుడు టీడీపీకి చెందిన వాళ్లే. మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ తరపున మొదటి నుంచి భుజాలకు ఎత్తుకున్న కంచర్ల సోదరులు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మునుగోడులో పర్యటిస్తూ 'తాను టీడీపీ బిడ్డని' అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక విధంగా చూస్తే క్షేత్ర స్థాయిలో కాస్తో కూస్తో టీడీపీ సాంప్రదాయ ఓట్లు ఇంకా మిగిలే ఉన్నాయి.
కాగా, ఆ ఓట్లు టీడీపీని గెలిపిస్తుందని మాత్రం చంద్రబాబు భావించడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టి..కనీసం డిపాజిట్ కూడా దక్కకపోతే మొదటికే మోసం వస్తుందని బాబు భావిస్తున్నారు. అయితే, బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకుంటామని తెలంగాణ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జక్కిలి ఐలయ్య యాదవ్ కూడా పోటీకీ రెడీ అని స్పష్టం చేశారు. అధినేత చంద్రబాబు ఓకే అంటే వెంటనే నామినేషన్ కూడా వేస్తానని చెప్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం విషయం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారు. పోటీకి దిగాలా లేదా ఎవరికైనా మద్దతు ఇవ్వాలా అనే సందిగ్దంలో ఉన్నారు. కాగా, టీడీపీ మద్దతు కావాలని ఏ పార్టీ అడగటం లేదు. ఇది చంద్రబాబును ఇబ్బంది పెడుతోంది. ముందుగానే తాను మద్దతు ప్రకటిస్తే.. వాళ్లు మీ మద్దతు అవసరం లేదని అంటే.. పరువు పోతుంది. అందుకే ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.