జైల్లో చంద్రబాబు.. డైలమాలో టీ-టీడీపీ నాయకులు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలంగాణ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించాలని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Update:2023-10-19 08:48 IST

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. అన్ని రాజకీయ పార్టీలు ఫుల్ జోష్‌లో కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రోజుకు రెండు సభలతో ప్రజల వద్దకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి ప్రచారానికి తెరతీసింది. ఇక బీజేపీ ఇప్పటికే మోడీ, అమిత్ షా సభలతో ప్రచారం ప్రారంభించింది. బీజేపీ-జనసేన పొత్తుపై రేపోమాపో క్లారిటీ రానున్నది. అయితే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం మాత్రం సైలెంట్‌గా ఉన్నది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా అభ్యర్థుల లిస్టు లేదు, ప్రచారం ఊసే లేదు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలంగాణ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించాలని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రయత్నిస్తున్నారు. కానీ జైలు ములాఖత్‌ కోసం కాసాని ప్రయత్నించినా కుదరలేదు. అసలు టీడీపీ ఈ సారి ఎన్నికల బరిలో ఉంటుందా లేదా అనే సందిగ్దంలో నాయకులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 42 రోజుల సమయమే ఉన్నది. అయినా టీడీపీ సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తుందా? లేదంటే పొత్తులు ఉంటాయా అనే విషయంపై క్లారిటీ లేదు.

ఇప్పటికే సర్వే పూర్తి చేశామని.. 30 మంది అభ్యర్థుల లిస్టు రెడీగా ఉందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. మరో 87 స్థానాల్లో అభ్యర్థుల కోసం సర్వే చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ కాసాని మాటలను తెలంగాణ టీడీపీ నాయకులు నమ్మడం లేదు. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ విషయంలో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని కూడా అన్నారు. కానీ టీడీపీ-జనసేన మధ్య చర్చలు జరిగిన దాఖలాలే లేవు.

చంద్రబాబు అసలు తెలంగాణ ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదనే ఆలోచన కూడా బాబుకు ఉన్నట్లు ఆ మధ్య లీకులు వచ్చాయి. అయితే కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం తెలంగాణలో పోటీ చేసి తీరతామని చెబుతున్నారు. ఒకవైపు ఇతర పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటుంటే.. టీడీపీ నాయకులు మాత్రం సైలెంట్‌గా ఇండ్లకే పరిమితం అయ్యారు.

టికెట్ వస్తుందనే ఆశతో ప్రచారం ప్రారంభించినా.. ఆ తర్వాత చంద్రబాబు పోటీకి దిగడం లేదని ప్రకటిస్తే అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. జనసేన-బీజేపీతో కలసి టీడీపీ పోటీ చేస్తే మంచిదనే వ్యాఖ్యలు కూడా పార్టీ నాయకులు చేస్తున్నారు. కనీసం 10 సీట్లైనా టీడీపీ గెలుస్తుందని.. హంగ్ వస్తే కీలకంగా మారతామనే ఆశల్లో టీడీపీ నాయకులు ఉన్నారు. కానీ అటు చంద్రబాబు కానీ, ఇటు కాసాని కానీ పోటీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో నాయకులు డైలమాలో పడిపోయారు.

Tags:    
Advertisement

Similar News