రేపే చలో మేడిగడ్డ.. తెలంగాణలో పొలిటికల్ హీట్

యాత్రను స్వాగతిస్తున్నట్టు చెప్పినా.. స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ బృందాన్ని వివిధ ప్రాంతాల్లో అడ్డుకునే అవకాశం కూడా ఉంది. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.

Advertisement
Update:2024-02-29 08:47 IST

మార్చి 1న బీఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' కార్యక్రమం నిర్వహించబోతోంది. కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా ఈ కార్యక్రమం చేపట్టారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డకు చేరుకుంటుంది. పార్టీ నేతలు, సాగునీటి రంగ నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మేడిగడ్డపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ప్రకటన రోజే అధికార కాంగ్రెస్ ఘాటుగా రియాక్ట్ అయింది. మేడిగడ్డకు వెళ్లి అక్కడి పరిస్థితులు చూసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ని డిమాండ్ చేసింది. ఈ దశలో అసలీ కార్యక్రమం సజావుగా సాగుతుందా..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల తూటాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.

పటిష్ట బందోబస్తు..

‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని, బందోబస్తు కల్పించాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం డీజీపీ రవిగుప్తాను కోరింది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ సహా మరికొందరు కీలక నేతలు డీజీపీని కలసి వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌ నుంచి మేడిగడ్డ వరకు రూట్‌ మ్యాప్‌ అందించారు. చలో మేడిగడ్డ కార్యక్రమానికి బందోబస్తు కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు బీఆర్ఎస్ ప్రతినిధులు చెబుతున్నారు.

రూట్ మ్యాల్ ఇలా..

హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన బీఆర్‌ఎస్‌ బృందం ఉప్పల్‌, ఘట్‌కేసర్‌, భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్‌, పరకాల, భూపాలపల్లి మీదుగా మేడిగడ్డకు చేరుకుంటుంది. భూపాలపల్లిలో మధ్యాహ్న భోజనం కోసం విరామం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని స్థానిక నేతలు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బృందాన్ని వాహనాల్లో అనుసరిస్తారని తెలుస్తోంది. ఆ వాహనాలన్నీ మేడిగడ్డకు చేరుకునే టైమ్ కి బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడ హాజరయ్యే అవకాశముంది.

కాంగ్రెస్ వైఖరి ఏంటి..?

చలో మేడిగడ్డను స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు ఇదివరకే స్పష్టం చేశారు. అయితే అక్కడికి వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ ఛలోక్తులు విసిరారు. యాత్రను స్వాగతిస్తున్నట్టు చెప్పినా.. స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ బృందాన్ని వివిధ ప్రాంతాల్లో అడ్డుకునే అవకాశం కూడా ఉంది. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. 

Tags:    
Advertisement

Similar News