పార్లమెంటు సాక్షిగా కేంద్రం అబద్దాలు...ఇవిగో రుజువులు -కేటీఆర్ ధ్వజం

పార్లమెంటులో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బల్క్ డ్రగ్ పార్కును ఏపీకి కేటాయిస్తున్నట్టు లిఖితపూర్వకంగా చెప్పారని, తెలంగాణకు కేటాయించినట్టు నోటిమాటగా చెప్పారని దీని మర్మమేంటని విరుచుకపడ్డారు కేటీఆర్. ఆయన‌ తెలంగాణ గుండెకు గాయం చేశారని మండిపడ్డారు.

Advertisement
Update:2022-12-17 22:53 IST

కేంద్ర బీజేపీ సర్కార్ పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడుతోందని తెలంగాణ మంత్రి , బీఆరెస్ వర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

పార్లమెంటులో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బల్క్ డ్రగ్ పార్కును ఏపీకి కేటాయిస్తున్నట్టు లిఖితపూర్వకంగా చెప్పారని, తెలంగాణకు కేటాయించినట్టు నోటిమాటగా చెప్పారని దీని మర్మమేంటని విరుచుకపడ్డారు కేటీఆర్. ఆయన‌ తెలంగాణ గుండెకు గాయం చేశారని మండిపడ్డారు.

"శ్రీ మన్సుఖ్ మాండవియా జీ అంత పెద్ద అబద్దమా. మీరు తెలంగాణ హృదయాన్ని బాధపెట్టారు''

"భారతదేశం యొక్క ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ అయిన హైదరాబాద్ కు బల్క్ డ్రగ్ పార్క్‌ను నిరాకరించడం ద్వారా, మీరు దేశానికి గొప్ప అపచారం చేసారు. ఎన్‌పిఎ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి "అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేంద్ర మంత్రిని కేటీఆర్ తప్పుబట్టారు.పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని లోక్‌సభలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావును ఆయన కోరారు.

"మంత్రి తన పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆగస్టు హౌజ్ - భారత పార్లమెంటును కూడా తప్పుదారి పట్టించారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని కోరుతున్నాను. తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పేలా చూసుకోండి" అని రామారావు ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్ పై నెటిజనులు కూడా స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రెండు నాల్కల ధోరణిపై మండిపడుతున్నారు.

"ఇచ్చినా(బల్క్ డ్రగ్ పార్క్‌) ఉపయోగం లేదు, బిజెపి తన బిలియనీర్ స్నేహితుల జేబులు నింపడానికి పెట్టుబడుల ఉపసంహరణ పథకంలో దానిని మళ్ళీ అమ్మేస్తుంది." అని సుప్రియా రెడ్డి అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేసింది.

''ఫేక్ న్యూస్ అయినా సరే వ్యాప్తి చేయండి అంటూ వారి కార్యకర్తలను కోరిన వారి సుప్రీం నాయకుడు అమిత్ షా అడుగుజాడల్లో అతను (మన్సుఖ్ మాండవీయ) నిజాయితీగా నడుస్తున్నాడు.'' అని రాహుల్ అనే నెటిజన్ కామెంట్ చేశాడు.

కాగా దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించగా... తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు మన్సుఖ్ మాండవీయ పార్లమెంటులో మౌఖికంగా తెలియజేశారు. కానీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారంలో మాత్రం బల్క్ డ్రగ్ పార్కులను ఏపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లకు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పైవిధంగా స్పందించారు.


Tags:    
Advertisement

Similar News