తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గతేడాది అక్టోబర్ 23న ఈ ముగ్గురి పేర్లను సిఫారసు చేశారు. ఈ సందర్భంగా మరో ఇద్దరు తన సహచర సీనియర్ జడ్జిలను చీఫ్ జస్టిస్ సంప్రదించారు.
తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాదులైన లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటిలతో పాటు జ్యుడీషియల్ అధికారిణి సుజనను హైకోర్టు అదనపు జడ్జిలుగా నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం వెల్లడించారు.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గతేడాది అక్టోబర్ 23న ఈ ముగ్గురి పేర్లను సిఫారసు చేశారు. ఈ సందర్భంగా మరో ఇద్దరు తన సహచర సీనియర్ జడ్జిలను చీఫ్ జస్టిస్ సంప్రదించారు. వీరి పేర్లను పరిశీలించిన అనంతరం సుప్రీం కోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. దానిపై తాజాగా కేంద్రం వారి నియామకాన్ని నోటిఫై చేసింది.
అలాగే మరికొందరు కొత్త న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులు కూడా చేపట్టినట్టు రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలను నియమించిన కేంద్రం.. బాంబే హైకోర్టులో ఇద్దరు అదనపు జడ్జిలకు శాశ్వత జడ్జిలుగా పదోన్నతి కల్పించిందని తెలిపారు. కోల్‌కతా హైకోర్టులో ముగ్గురు, గౌహతి హైకోర్టులో ఐదుగురు, కేరళ హైకోర్టులో నలుగురు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు ఒకరు.. అదనపు జడ్జిలను శాశ్వత జడ్జిలుగా నియమించినట్టు రామ్ మేఘ్వాల్ ట్విటర్‌లో పేర్కొన్నారు.