కొత్తగా 5 రాష్ట్రాలకు విపత్తు సహాయ నిధులు మంజూరు చేసిన కేంద్రం...తెలంగాణకు మళ్ళీ మొండి చేయి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం కేంద్ర సాయం రూ.1,816.162 కోట్లలో అస్సాంకు రూ.520.46 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.239.31 కోట్లు, కర్ణాటకకు రూ.941.04 కోట్లు, మేఘాలయకు రూ.47.326 కోట్లు, నాగాలాండ్‌కు రూ.68.02 కోట్లు మంజూరు చేసింది.
2022లో వరదలు, కొండచరియలు విరిగిపడడం, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు నిధి (NDRF) కింద రూ. 1,816.16 కోట్ల అదనపు సహాయాన్ని కేంద్రం సోమవారం ఆమోదించింది. అయితే, గత ఏడాది జూలైలో గోదావరి నదిలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి భారీ నష్టం జరిగిన నేపథ్యంలో తెలంగాణకు రూ.1,000 కోట్ల సాయం అందించాలని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం అప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరో సారి మొండి చేయి చూపించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం కేంద్ర సాయం రూ.1,816.162 కోట్లలో అస్సాంకు రూ.520.46 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.239.31 కోట్లు, కర్ణాటకకు రూ.941.04 కోట్లు, మేఘాలయకు రూ.47.326 కోట్లు, నాగాలాండ్‌కు రూ.68.02 కోట్లు మంజూరు చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు బీజేపీ లేదా దాని మిత్రపక్షాల పాలనలో ఉన్నాయి.
గత ఏడాది జూలైలో తెలంగాణ రాష్ట్రం అంతటా ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి , భారీ వరదలొచ్చాయి. లోతట్టు ప్రాంతాలలోని అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తు, నీరు, నిత్యావసరాల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వానకాలం (ఖరీఫ్) సీజన్ ప్రారంభంలోనే తమ పొలాలు ముంపునకు గురికావడంతో రైతులు కూడా నష్టపోయారు.
కనీసం 15 మంది మరణించారు. 30,000 మందికి పైగా బాధితులను రెస్క్యూ క్యాంపులకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదిలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు 71 అడుగులకు చేరింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాలు, ములుగు, పెద్దపల్లి జిల్లాలు కూడా భారీ వర్షంతో అతలాకుతలమయ్యాయి.
వరదల కారణంగా రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి, వరద నష్టంపై ప్రాథమిక అంచనాలను కేంద్రానికి సమర్పించింది. కేంద్రం నుంచి తక్షణమే రూ.1000 కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వం తమ జాతీయవిపత్తు నిధి (NDRF) కింద 25 రాష్ట్రాలకు రూ. 15,770.40 కోట్లు, మరో నాలుగు రాష్ట్రాలకు అదనంగా రూ. 502.74 కోట్లు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా తెలంగాణకు వార్షిక నిధులు మినహా కేంద్రం ఎలాంటి అదనపు నిధులు విడుదల చేయలేదు. అంతేకాకుండా, విపత్తులు సంభవించిన వెంటనే, రాష్ట్రాల నుండి మెమోరాండం అందే వరకు వేచి ఉండకుండా, బిజెపి ప్రభుత్వం మొత్తం ఐదు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను నియమించింది. కానీ తెలంగాణకు వరద నష్టం నివేదికను తప్పనిసరి చేసింది. ఆ నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఎలాంటి సహాయం చేయలేదు.