గ్రూప్ -1 విద్యార్థులకు మద్దతు.. బండి సంజయ్ అరెస్ట్
ఉద్రిక్తంగా మారిన అశోక్ నగర్.. చలో సెక్రటేరియట్ భగ్నం
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా కోసం ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయడాన్ని సంజయ్ ఖండించారు. విద్యార్థులతో కలిసి సంజయ్ చలో సెక్రటేరియట్ కోసం బయల్దేరారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మోహరించి సంజయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, మహిళల హాస్టళ్లలోకి చొరబడి కొట్టే అధికారం మీకెవరిచ్చారని పోలీసు అధికారులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కలిసి వాస్తవాలేమిటో వివరిస్తానని ఆయన అక్కడి నుంచి ముందుకు కదిలారు. సెక్రటేరియట్ వైపునకు సంజయ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రూప్ -1 అభ్యర్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చొటు చేసుకుంది. పోలీసులు గో బ్యాక్ అని విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకోవడంతో ఆయన తన కారుపైకి ఎక్కి విద్యార్థులతో మాట్లాడారు.