అమిత్ షా కాన్వాయ్‌కి కారు అడ్డం పెట్టడంపై కేంద్ర ఇంటెలిజెన్స్ సీరియస్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ఆయన కాన్వాయ్‌కి అడ్డంకులు సృష్టించడంపై ఇంటెలిజెన్స్ సీరియస్‌గా తీసుకున్నది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ఆయన కాన్వాయ్‌కి అడ్డంకులు సృష్టించడంపై ఇంటెలిజెన్స్ సీరియస్‌గా తీసుకున్నది. దేశంలో ప్రధాని తర్వాత రెండో పవర్ ఫుల్ వ్యక్తిగా పేరున్న అమిత్ షాకు భారీ భద్రతా ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినా ఆయనకు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఐదు నిమిషాల ముందే ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి ఆయనకు దారి వదులుతారు. అలాంటిది హైదరాబాద్‌లోని హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్ వెళ్లకుండా కారు అడ్డం పెట్టడంపై హోం శాఖ ఆరా తీస్తోంది.
హరిత ప్లాజాలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అమిత్ షా చేరుకోవడానికి ముందే.. ఆ హోటల్‌లోకి వెళ్లడానికి గోసుల శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడకు వచ్చారు. హోటల్ లోపలకు వెళ్లకుండా కారును అడ్డంగా పెట్టి అక్కడే ఆపేశారు. పోలీసులు పలు మార్లు హెచ్చరిక జారీ చేసినా కారును అక్కడి నుంచి తీయలేదు. చివరకు కారు అద్దాలు పగులగొట్టి అతడిని బయటకు తీసి.. కారును పక్కన పెట్టారు. దీంతో అమిత్ షా కాన్వాయ్‌లోనే ఐదు నిమిషాలు ఉండిపోవల్సి వచ్చింది. గోసుల శ్రీనివాస్ అనే వ్యక్తి యాదృశ్చికంగా అక్కడకు వచ్చి కారు నిలపలేదని.. దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ ఆనుమానం వ్యక్తం చేసింది. విషయం తెలిసి ఢిల్లీలోని ఉన్నతాధికారులు వెంటనే అమిత్ షా భద్రతా వ్యవహారాలు చూసే అధికారులతో మాట్లాడారు.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా రెండు పార్టీల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. గోసుల శ్రీనివాస్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నేతగా చెప్పుకుంటున్నారు. ఆయన ఎందుకు కారును అడ్డు పెట్టారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గోసుల శ్రీనవాస్‌తో పాటు ఆయన కారును పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అనుకోకుండా అక్కడకు వచ్చి కారు నిలిపాడా? ఏదైనా దురుద్దేశంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే అక్కడకు వచ్చాడా అని ఆరా తీస్తున్నారు. హరిత ప్లాజా హోటల్‌లో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కోసం అమిత్ షా వచ్చారు. అక్కడ ఇతర పార్టీ లేదా సంస్థలకు చెందిన ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు.
ఈ క్రమంలో అసలు గోసుల శ్రీనివాస్ ఎందుకు వచ్చారనేది ఇప్పుడు అనుమానంగా మారింది. అమిత్ షా కాన్వాయ్‌కి కారును కావాలనే అడ్డుపెట్టి భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. స్థానిక పోలీసులతో పాటు హోం శాఖ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.